
మాట్లాడుతున్న స్వామీజీ, చిత్రంలో స్వాత్మానందేంద్ర సరస్వతి
పెందుర్తి: పండుగలను నిర్ణయించే విషయంలో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి రావాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. పండుగల విషయంలో పంచాయితీలు సరికాదన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను అంచనావేయడం వంటి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగకర్తలు దృష్టి సారించాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడమీ తరఫున ఆదివారం దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. పండుగల విషయంలో విభేదాలను పక్కనపెట్టి, పంచాంగకర్తలు అందరూ ఏకతాటిపై నిలవాలన్నారు. రాబోయే ప్లవ నామ సంవత్సరానికి సంబంధించి పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో పంచాంగాలను ప్రచురించాలని కోరారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పంచాంగకర్తలందరితో పెద్దఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, అర్చక ట్రైనింగ్ అకాడమి డైరెక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలన సంస్థ డైరెక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు, పలువురు పంచాంగకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.