
కాకినాడ రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న గో మాత పేరు సారణ. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్ గారాల పట్టి. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా.. వారి కంటే ఎక్కువ ప్రేమను సారణపై చూపుతారు. సరిగ్గా 20 నెలల కిత్రం అనగా 2022జనవరి 22న సారణకు బారసాల, ఊయల వేడుకను శాస్తోక్తంగా నిర్వహించి సారణగా నామకరణం చేశారు.
అప్పట్లో మీడియాలో గోమాతకు బారసాల పెద్ద వైరల్ అయ్యింది. ఇప్పుడు 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఉదయం 9గంటలకు నుంచి స్వయంవరం ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాలలోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు.
ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 నందీశ్వరులను వరుసలో ఉంచగా వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. తరువాత ఫంక్షన్ హాలులో వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్తోక్తంగా కల్యాణం జరుపుతారని డాక్టరు గౌరీశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment