బీఆర్‌టీఎస్ రోడ్డులో చలో విజయవాడకు వచ్చిన వారు
సాక్షి, అమరావతి: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు సంయమనం ప్రద ర్శించడంతో సాఫీగా జరిగిపోయింది. ఐదు వేల మందితో కార్యక్రమం నిర్వహణకు అనుమతి కోరిన ఉద్యోగ సంఘాల నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు పాల్గొనడమే కాకుండా కార్యక్రమాన్ని ఆసాంతం నడిపిం చారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతోపాటు జన సమీకరణ కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు దిగినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ కార్యకర్త ఇప్పుడు గెజిటెడ్ అధికారి అయ్యాడంటూ చలో విజయవాడపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.
రెండు రోజుల ముందే..
వివిధ ప్రాంతాల నుంచి చలో విజయవాడకు హాజరైన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘాలవారీగా ఉద్యోగులు బ్యానర్లతో గాంధీనగర్ చేరుకుని అక్కడి నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు ర్యాలీలుగా వెళ్లారు. ఫుడ్ జంక్షన్ నుంచి భానునగర్ వంతెన వరకు నిలుచుని ప్రదర్శన చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి నేతలు ఓ వాహనంపైకి ఎక్కి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోయినా ప్రణాళిక ప్రకారం తరలి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఉద్యోగ సంఘాల నేతలు ఒక వ్యూహం ప్రకారం రెండు రోజుల ముందే ఉద్యోగులు నగరానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు బీఆర్‌టీఎస్ రోడ్డులోకి చేరుకున్నాక కూడా పీఆర్సీ సాధన సమితి నేతలు రాకపోవడంతో అయోమయం నెలకొంది. చివరికి అప్పటికప్పుడు ఒక వాహనంపైకి చేరుకుని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రసంగించారు. ఒకవైపు పీఆర్సీ సాధన సమితి నేతలు తాము ప్రభుత్వంతో యుద్ధం చేయడం లేదని చెబుతుంటే మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ యూటీఎఫ్ నాయకులు ప్రకటించారు. సీఎంను ఇంటికి పంపుతామని, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఫ్యాప్టో అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment