సాక్షి ప్రతినిధి, విజయవాడ: కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నప్పటికీ ఒక్కోసారి నటుడి పొరపాట్ల కారణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిల పడుతుంటాయి. మొన్నటి చంద్రబాబు రోడ్‌షోలోనూ అచ్చంగా ఇదే జరిగింది. చంద్రబాబు అద్భుత నటుడే కానీ, ఎందుకో.. ఏమో ఆ రోజు ఓ పొరపాటు చేసేశారు. ఆ పొరపాటే ఇప్పుడు ఆయన్ను చులకన చేసింది. ఆ ఎపిసోడ్ అంతా ఉత్తుత్తేనని తేల్చేసింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ పట్టుకోల్పోతున్న టీడీపీని గట్టెక్కించేందుకు చంద్రబాబు ఓ పన్నాగం పన్నారు. ఇటీవల నందిగామ పర్యటనలో.. తనపైకి ఎవరో రాయి విసిరారని.. అది అధికార పార్టీ వారి పనేనని రచ్చ రచ్చ చేశారు. అది గురితప్పి తన భద్రతా«ధికారికి తగిలిందంటూ.. చిన్నపాటి గాయాన్ని చూపించారు. అయితే ఇదంతా పక్కాగా ముందస్తు ప్రణాళికతో నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనలో తమపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు చేయడానికి ముందుగానే తగిన కసరత్తు చేశారని స్పష్టం అవుతోంది.ఆరోజు చంద్రబాబు భద్రతాధికారి మధుబాబు తనకు గాయం అయ్యిందని, దానిపై తెల్లటి రుమాలు పెట్టుకుని వాహనంపై ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. ఆ వెంటనే ఆయనపై దాడి జరిగిందని చంద్రబాబు ప్రకటించేశారు. ఇక ఆ తర్వాత నుంచి చంద్రబాబు అండ్ టీడీపీ గ్యాంగ్ ఆ డ్రామాను రక్తి కట్టించేందుకు పడరాని పాట్లు పడ్డారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
► ఎవరిపై అయినా దాడి జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేస్తారు. డీఎస్పీ హోదాలో ఉన్న మధుబాబుకు ఆ మాత్రం తెలీదా? అనే చర్చ మొదలైంది. దీంతో ఆ మరుసటి రోజు కానిస్టేబుల్‌తో ఆయన ఫిర్యాదు పంపారు. పోలీసులు మెడికల్ టెస్ట్‌కు రమ్మని పిలిచినా రాకుండా హైదరాబాద్‌లోనే ఎందుకు ఉండిపోయారు? ఈరోజు, రేపు అంటూ ఇప్పటికీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు?
► ఎవరైనా రాయితో దాడి చేస్తే, ఆ రాయిని చూపిస్తూ మాట్లాడతారు. మరి ఆ రోజు ఆ రాయిని చంద్రబాబు ఎందుకు చూపలేదు? ఇక్కడే చంద్రబాబు రాయిని చూపకుండా పొరపాటు చేశారు. ఓ రాయిని ముందే సిద్ధం చేసుకుని ఉండటం మరిచారు కాబోలు! లేదా ఆ రాయి వెంటనే మాయమై పోయిందేమో! మామూలుగా రాయి తగిలితే, తగిలిన చోట వాపు వస్తుంది. మధుబాబుకు అయిన గాయం వద్ద అలాంటి వాపు కనిపించ లేదు.
► ఘటన జరిగినప్పుడు చంద్రబాబు రక్తం అంటిన తెల్ల రుమాలు మాత్రమే చూపారు. రాయి ఎందుకు చూపలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అది రాయి దాడి కాదని తేటతెల్లం అయ్యింది.
► రోడ్డుషోలో పొరపాటున చెట్టు కొమ్మ కానీ, చైతన్య రథంకు సంబంధించిన పైపులు, బోల్టో, జెండా కర్రో తగిలి రాసుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. జనాలు విచ్చల విడిగా పూలు చల్లారు. ఆ పూలలో నుంచి ఏదైనా వస్తువు పొరపాటున వచ్చి తగిలుండొచ్చనే అనుమానాన్ని టీడీపీలోని కొంత మంది నాయకులే వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క విజువల్ లేదే!
► రోడ్డుషోను ఆద్యంతం ఇటు పోలీసు వర్గాలు, అటు టీడీపీ వర్గాలు చిత్రీకరించాయి. అలాంటప్పుడు రాయి దాడికి సంబంధించిన ఆధారాలు, వీడియో ఫుటేజీని వారు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు తీసిన, చిత్రీకరించిన కెమెరా ఫుటేజీ, డ్రోన్ విజువల్స్‌ను ఇప్పటికే పలుమార్లు పరిశీలించారు. వాటిలో ఎక్కడా రాయి విసిరిన దృశ్యాలు కనిపించలేదు.
► వెంటనే ఫిర్యాదు అందకపోయినా, బాధ్యతాయుతంగా స్పందించి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఘటన ప్రాంతానికి పంపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను నియమించారు. అందిన ఫిర్యాదు మేరకు లీగల్ ఓపీనియన్ తీసుకొని పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
► దీంతో తమ ఎత్తుగడ ఫలించలేదని భావించిన చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారు. ‘పెట్టి’ కేసు లాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, హత్యాయత్నంకు సంబంధించిన సెక్షన్‌లకు మార్చాలంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలను గవర్నర్ వద్దకు పంపారు.
► ఇంతటితో ఆగకుండా మంగళవారం నందిగామలో టీడీపీ నేతలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, అక్కడే నిరాహార దీక్ష చేయడం.. సాయంత్రానికి మళ్లీ కొంత మంది నాయకులు వచ్చి దీక్ష విరమింపజేయడం చూస్తుంటే ఈ అంశాన్ని ఎలాగైనా లైవ్‌లో ఉంచి లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యంగా తెలుస్తోంది.
► ఎవరైనా నిజంగా రాయి విసిరివుంటే పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ క్యాడర్ చూస్తూ ఊరుకునేదా? అతన్ని పట్టుకుని చితకబాదేవారు కాదా? అనే ప్రశ్నకు టీడీపీ నేతలు ఏమని బదులిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమపై పడ్డ రాయి ఆ రోజు కనిపించలేదని, ఇప్పుడు దొరికిందని వేరే రాయిని తీసుకొచ్చి చూపినా ఆశ్చర్యం లేదని బాబు తత్వం తెలిసిన ఓ నేత వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment