లోకేశ్ పాదయాత్ర పరిస్థితి ఇదీ..
సాక్షి, తిరుపతి: నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా జన సమీకరణకు టీడీపీ నేతలు పడుతున్న తిప్పలు, సీనియర్ నాయకుల హెచ్చరికలు సాక్ష్యాధారాలతో బహిర్గతమయ్యాయి. కుప్పంలో మొదలైన లోకేశ్ పాదయాత్ర గురువారం గంగాధర నెల్లూరు నియోజక వర్గానికి చేరుకుంది. జన సమీకరణపై బుధవారం రాత్రి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరికలు చేశారు. ఈ ఆడియో లీక్ కావడంతో కలకలం రేగింది.
సంభాషణ సాగిందిలా...
చిట్టిబాబు నాయుడు (టీడీపీ గంగాధర నెల్లూరు ఇన్‌చార్జి): అన్నా డీఎస్పీ ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకుంటున్నా. మీరు చెప్పినట్లుగా ఉదయాన్నే వెయ్యి మంది వచ్చేందుకు వాహనాలు అరేంజ్ చేశా. రోజూ పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోపు ఆరు మండలాల్లోనూ 50 వాహనాలు ఏర్పాటు చేశా. 300 వాహనాలకు డబ్బులు కూడా ఇచ్చేశా. నాలుగు రోజులకు బుక్ చేశా. రోజూ 3 వేల మంది పాదయాత్రకు రావాలని చెప్పాం అన్నా.
► అచ్చెన్నాయుడు: మొన్న చూశారు కదా..! చిత్తూరులో చూసి నేను, సార్ (చంద్రబాబు) చాలా బాధపడ్డాం.
►చిట్టిబాబు నాయుడు: అన్నన్నా.. అలా జరగదన్నా. మా నియోజకవర్గంలో అలా జరగదన్నా. నేను చేస్తా. చిత్తూరులో ఏమైందో నాకు తెలియదు.
►అచ్చెన్నాయుడు: ఏంటంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలో జనం ఉండడం లేదు. పలుచగా ఉంటున్నారు. సాయంత్రం మాత్రం ఓ మోస్తరుగా వస్తున్నారు. జనం పలుచబడడం అనేది ఉండకూడదు. ఒక గ్రామం నుంచి వచ్చిన వారు మరో గ్రామం వరకు వచ్చేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకో.
►చిట్టిబాబు నాయుడు: అలాగే అన్నా. ప్రతి కిలోమీటర్‌కు వెల్‌కమ్ పాయింట్లు ఏర్పాటు చేశా. అలా 10 ఏర్పాటు చేశానన్నా. వెల్‌కమ్ పాయింట్ల వద్ద వెయ్యి మంది ఉండేలా చూస్తున్నాం. డ్రమ్స్, మైక్‌లు ఉంటాయి. వచ్చిన వారికి మజ్జిగ ఇస్తున్నాం. పూలు చల్లడం, టపాకాయలు కాల్చడం, అక్కడే మహిళలు వచ్చి హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు కొట్టడం.. ఇవన్నీ ప్రతి జంక్షన్‌లో చేస్తున్నాం అన్నా. తమిళనాడు నుంచి జెండాలు కట్టేందుకు 5 వేల పైపులు తీసుకొచ్చాం. 14 కి.మీ జెండాలు కడతాం అన్నా.
►అచ్చెన్నాయుడు: ఓకే ఓకే.. థ్యాంక్యూ థ్యాంక్యూ. ఏదైనా ఉంటే నాకు చెప్పు. మండల, యూనిట్ ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలి. జనం మొబిలైజేషన్ లేకపోతే మాకు తెలుస్తుంది. వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో మాదిరిగా కాకుండా విజయవంతం చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీ అందరికీ నమస్కారం.
Comments
Please login to add a commentAdd a comment