సింహాచలం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న అయ్యన్న, ఆయన తనయుడు రాజేష్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు.
కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా..
నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది.
ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్‌వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్‌వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.
ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు
చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్‌మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్‌వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు.
దీనిని పరిశీలించిన ఈఈ ఎన్‌వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్‌వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది.
ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్‌వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్‌వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్‌లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్‌స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్‌వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది.
కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది.
ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్‌వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది.
బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment