సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లతో పోలిస్తే ఒకే ఇంటి నంబర్‌పై అధిక ఓటర్లు నమోదైన సంఖ్య చాలా తక్కువని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఒకే ఇంట్లో 500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఆరు ఇంటి నంబర్లను గుర్తించామన్నారు. 2018కు ముందు నుంచే ఇలా ఉందని చెప్పారు. పట్టణాల్లో అపార్ట్‌మెంట్లలో నివసించేవారు ఒకటే ఇంటి నంబరు, కొన్నిచోట్ల ఒకటే వీధి పేరు మీద ఓటర్‌గా నమోదు చేసుకోవడం వల్ల ఇలాంటి తప్పులు దొర్లాయని వెల్లడించారు. 50 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 2,100 ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.98 కోట్ల ఓటర్లకుగానూ ఒకే రకమైన ఇంటి నంబర్లు కలిగినవారు 1.62 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ–2024 (ఎస్‌ఎస్‌ఆర్–2024) కార్యక్రమంలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం సచివాలయంలో మీనా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఆర్–2024 షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఆధార్‌తో అనుసంధానించలేదు..
అలాగే రెండు, మూడు చోట్ల ఒకరే ఓటర్లుగా ఉన్నవారిని గుర్తించామని మీనా తెలిపారు. వారు కోరుకున్న చోట ఓటు ఉంచి మిగిలిన చోట్ల రద్దు చేశామన్నారు. ఒకే ఫొటోతో రెండు, మూడు కార్డులున్న 15 లక్షల మంది ఓటర్లను గుర్తించి.. అందులో 10.20 లక్షల నకిలీ ఓటర్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయలేదన్నారు. 80 శాతం మంది ఓటర్ల నుంచి ఆధార్ సమాచారం తీసుకున్నామే కానీ వాటిని ఇంకా అనుసంధానించలేదని స్పష్టం చేశారు.
యువ ఓటర్ల నమోదుపై దృష్టి
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించామన్నారు. 18–19 ఏళ్ల వయసు ఉన్నవారు.. దేశ సగటు ప్రకారం చూస్తే రాష్ట్ర ఓటర్ల సంఖ్య ప్రకారం కనీసం 12 లక్షలు ఉండాలన్నారు. కానీ అది మన రాష్ట్రంలో 3.5 లక్షలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇందుకు ఎస్‌ఎస్‌ఆర్–2024ను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్‌ఎస్‌ఆర్ కోసం జూలై 20 వరకు ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలకు శిక్షణ ఇస్తామన్నారు. బీఎల్‌వోలు ఇంటింటా సర్వే చేశాక అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అన్ని రాజకీయపార్టీలకు అందిస్తామన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నవంబర్ 30 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వచ్చినఅభ్యంతరాలను డిసెంబర్ 26లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వివరించారు.
రాజకీయ పార్టీలు సర్వేలో పాల్గొనాలి..
కాగా విజయవాడలో ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేస్తున్నామని మీనా తెలిపారు. ఇలా 2018 నుంచి ఒకటే ఇంటి పేరు మీద అధిక ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. 2018లో 674 మంది ఓటర్లు ఉంటే 2019లో 675 మంది.. ఇప్పుడు 516 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీటిని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఓటర్ల సవరణ చేస్తారన్నారు. ఈ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించుకొని బీఎల్‌వోలతో కలిసి సర్వేలో పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment