
సాక్షి, విజయవాడ : కీళ్ల నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి. వాతం నొప్పులు, అరుగుదల నొప్పులు, పోషకాహారం లోపించడం, ఒత్తిడి వలన నొప్పులు వస్తుంటాయి. వీటిలో కీళ్ల వాతం వలన కలిగే నొప్పులను తొలిదశలో గుర్తించడం ఎంతో అవసరం. నిర్లక్ష్యం చేస్తే, వాటి ప్రభావం ఇతర అవయవాలపై పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అక్టోబరు 12 ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
కారణాలు..
మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచే కణాలు(తెల్లరక్తకణాలు) బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడినప్పుడు తెల్లరక్తకణాలు మన శరీరంపైనే దాడి చేయడం ప్రారంభిస్తాయి. దీని వలన వచ్చే మార్పులను వాతం లక్షణాలు అంటారు. వీటినే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. వాటిలో కీళ్లవాతం అత్యధికంగా వస్తుంది. ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు రావడానికి జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, పర్యావరణంలో ఏర్పడే మార్పులు కారణం కావచ్చు అని శాస్త్రీయసమాచారం.
ఏ వయసులో వచ్చే అవకాశం..
మధ్య వయస్సు వారికి అంటే 30 నుంచి 60 ఏళ్ల స్త్రీలకు ఎక్కువుగా వస్తుంది. చిన్న పిల్లలకి, వృద్ధాప్యంలో వచ్చు వారికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కీళ్లవ్యాధులను నిర్ధారించడం ఎలా ?
కీళ్లవాతం తీరు, వాటితో వచ్చే ఇతర లక్షణాలును బట్టి, కొన్ని రకాల రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్ధారించడంతో పాటు, వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయవచ్చు. కీళ్ల వాతం లక్షణాలు ఉన్నప్పటికీ 40 శాతం మందికి రక్తపరీక్షలు నార్మల్‌గా ఉంటాయి. వారిని సెరోనెగిటివ్ ఆర్థరైటీస్‌గా గుర్తించి వైద్యం చేస్తారు.
ఆహార నియమాలు...
- కీళ్లవాతంతో బాధపడే వారు మంచి పోషక విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి.
- ప్రతినిత్యం ఆహారంలో పప్పుదినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టుతీయని తృణ«ధాన్యాలు ఉండేట్లు చూసుకోవాలి.
- ఆలీవ్ నూనెను వాడుకోవడం ఉత్తమం.
- పాలు, పెరుగు, గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి
- ఒమేగా–3 ఫ్యాటీ ఎసిడ్స్ అధికంగా ఉన్న చేపలు, భాదం. సోయా బీన్స్ తీసుకోవడం వలన నొప్పులు అదుపులో ఉంటాయి.
కీళ్ల వ్యాధుల్లో రకాలు, వాటి లక్షణాలు..
- రుమటాయిడ్ ఆర్థరైటిస్: చేతులు, కాళ్లకు ఉండే కణుపులు దగ్గర నొప్పులు, వాపులు రావడం దీని ముఖ్యలక్షణం.
- గౌట్: కాలి బ్రొటనవేలు, మడమ(చీలమండి) దగ్గర నొప్పి, వాపు రావడం దీని ముఖ్యలక్షణం.
- యాంకోలైసింగ్ స్పాండిలైసిస్: తొంటి, వెన్నుపూస నొప్పి రావడం, బిగుసుకు పోవడం, దీని ముఖ్యలక్షణం
- సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్ అనే చర్మవ్యాధి .ఉన్న వారిలో వచ్యే కీళ్లవాతం.
- లూపస్: కీళ్ల నొప్పులతో పాటు, ముఖం మీద సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు రావడం, నోటిపూత, జుట్టురాలిపోవడం ముఖ్యలక్షణం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- మధ్యపానం, ధూమపానం చేయకూడదు.
- రోజూ 6–8 గంటలు నిద్రపోవాలి
- యోగా, ధ్యానంతో ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు.
- ఊబకాయం. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.
- ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- ఇన్‌ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్‌లు వేసుకోవాలి.
- విటమిన్ ‘డి’ లోపం రాకుండా చూసుకోవాలి.
- పీసీఓడీ సమస్యలు పరిష్కరించుకోవాలి.
- చిన్న వయస్సులో గర్భసంచి, అండాశయం ఆపరేషన్లు చేయించుకోకూడదు.
- దంత సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
సులువుగా నియంత్రణలోకి తేవచ్చు
వైద్య రంగంలో జరిగిన సాంకేతిక అభివృద్ధి వలన గతంతో పోలిస్తే ఇప్పుడు అద్భుతమైన పనితీరు కలిగిన మందులు, బయోలాజిక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడటం ద్వారా ఇంతకు మందు మహమ్మారిగా ఉన్న కీళ్లవాతాన్ని అతి సులువుగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. చాలా మంది కీళ్ల వాతానికి వాడే మందుల వలన దుష్ప్రభావాలు ఉంటాయని భయపడి మందులు వాడక, అంగవైకల్యాన్ని తెచ్చుకుంటారు. – డాక్టర్ కావ్యాదేవి, ఎండీ,డీఎం, రుమటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment