3-Year-Old Boy, Attacked By Leopard Reached Home - Sakshi
Sakshi News home page

బాలుడిపై చిరుత దాడి: ఏడుకొండల స్వామి దయతో పునర్జన్మ

Published Tue, Jul 11 2023 12:37 PM | Last Updated on Tue, Jul 11 2023 1:00 PM

Tirumala Leopard Attack - Sakshi

చిరుత నోట్లో చిక్కుకొని ఏడుకొండల స్వామి దయతో ప్రాణాలతో బయటపడిన చిన్నారి 18 రోజుల అనంతరం తిరిగి సొంత ఊరికి చేరుకున్నాడు. తిరుమలలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన బాలుడిపై చిరుత దాడి ఘటన ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. కళ్లెదుటే పిల్లాడి    గొంతు కరుచుకొని క్షణాల్లో ఓ చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లడం కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న భక్తులను భయకంపితులను చేసింది. దేవుని దయ వల్ల బాలుడు మృత్యుంజయుడిగా సోమవారం ఆదోనిలోని తమ    ఇంటికి చేరుకోగా స్థానికుల్లో సంతోషం వ్యక్తమైంది. ఆ వివరాలు చిన్నారి తల్లిదండ్రులు శిరీష, కొండానాయక్‌ల మాటల్లోనే..

ఆదోని అర్బన్‌: ‘‘పట్టణంలోని రాజరాజేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నాం. చక్లీల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న మాకు ఇద్దరు కుమారులు(ప్రేమ్‌నాయక్, కౌశిక్‌ నాయక్‌) సంతానం. గత జూన్‌ 22న ఉదయం 7 గంటలకు ఆదోని నుంచి రైలులో తిరుపతికి బయలుదేరాం. మధ్యాహా్ననికి అక్కడికి చేరుకోగా.. సాయంత్రం అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు పయనమయ్యాం. మాతో పాటు తాత తిమ్మయ్య, అత్త సుజాత ఉన్నారు. మూడేళ్ల కౌశిక్‌ తన తాతతో పాటు ముందు వెళ్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత మీదకు దూకి బాలుడిని గొంత వద్ద పట్టుకొని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అందరం దాని వెంటపడ్డాం, మాతో పాటు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అరుపులు, కేకలు వేస్తూ అడవిలోకి పరుగు తీశాం. 

కారు చీకట్లో రోదిస్తూ ఎదురొచ్చాడు.. 
పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో భయాందోళనకు లోనైన c కారు చీకట్లో ఎక్కడెక్కడో వెతికాం. ఎత్తుకెళ్లి అరగంట గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఇక దక్కడనే అనుకున్నాం. ఆ సమయంలో పిల్లాడి ఏడుపు వినిపించడంతో ఆ దిశగా వెళ్లాం. రాళ్లు రప్పలను దాటుకుంటూ చెట్ల మధ్య నుంచి ఏడ్చుకుంటూ వస్తున్న మా కుమారుడిని చూడగానే ప్రాణం లేచివచ్చింది. ఏడుకొండల స్వామిని మనసులోనే తలుచుకొని పిల్లాడిని హత్తుకున్నాం. రక్తగాయాలను చూసి గుండె ఆగినంత పనైంది. ఏమైందో ఏమోనని కంగారుపడ్డాం. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే 108లో తిరుపతిలోని పద్మావతి చి్రల్డన్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

ఆస్పత్రిలో బాగా చూసుకున్నారు.. 
తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో మా కుమారునితో పాటు మాకందరికీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఇతర అధికారులు అందరూ అప్పటికప్పుడు స్పందించారు. ఆసుపత్రిలో కూడా ఎంతో ధైర్యం చెప్పారు. పిల్లానికి ఏమీ కాదని, ప్రాణహాని లేదని చెబుతూనే మెరుగైన వైద్యం అందించారు. 18 రోజుల చికిత్స అనంతరం గత శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా పిల్లాడిని మాకు పూర్తి ఆరోగ్యంతో అప్పగించారు. ఆ దేవునితో పాటు అధికారులందరికీ రుణపడి ఉంటాం. 

తల్లిదండ్రులు శిరీష, కొండాలతో బాలుడు కౌశిక్‌నాయక్‌ 
ఉచితంగానే దర్శనం 

డిశ్చార్జి అయిన వెంటనే పిల్లాడితో పాటు మమ్మల్ని  ప్రత్యేక వాహనంలో తిరుమలకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా రూములు కేటాయించి స్వామి వారి బ్రేక్‌ దర్శనభాగ్యం కలి్పంచారు. అరగంటలోపు  దర్శనం పూర్తి కాగా.. లడ్డూలను కూడా అందించారు. మా జీవితంలో ఈ దర్శనం మర్చిపోలేని అనుభూతి. ఆ తర్వాత తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో ఆదివారం మధ్యాహ్నం తిరుపతి రైల్వేస్టేషన్‌లో వదిలారు. సోమవారం ఇంటికి చేరుకున్నాం. బాబుకు పునర్జన్మ లభించిందంటే అంతా స్వామి దయ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement