
సాక్షి, తిరుమల : తిరుమలలో చెట్టుపైకి ఎక్కిన భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కరనాయుడు కథనం మేరకు... ఎస్‌ఎంసీ అతిథి గృహంలో 211వ నంబర్ గదికి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మపై పది అడుగుల భారీ కొండచిలువ చేరింది. దీంతో దాన్ని గుర్తించిన స్థానికులు, యాత్రికులు భయాందోళనకు గురై అటవీశాఖకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన విద్యుత్ శాఖకు చెందిన క్రేన్ సాయంతో కొండచిలువను చాకచక్యంగా కిందకు దించారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న భక్తులు, స్థానికులు దాన్ని ఆసక్తిగా గమనించి తమ సెల్‌ఫోన్లలో బంధించారు. అనంతరం కొండచిలువను అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.