ఎలక్ట్రిక్ బైక్‌తో ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు
సాక్షి, అమరావతి: తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. పాత బైక్‌కు లిథియమ్ అయాన్ బ్యాటరీని అమర్చి, వెనుక చక్రానికి మోటార్ బిగించడం ద్వారా వాహనం ముందుకు నడిచేలా తయారు చేశారు. 2 నెలల పాటు శ్రమించి వాయు, శబ్ధ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బైక్‌ను తయారుచేసినట్టు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రవితేజరెడ్డి, ఎ.చైతన్య, పాబోలు మోహన్ ఆదిత్య, కె.ప్రవీణ్, కె.యశస్విని, శ్రావ్య, వాసు, ప్రియాంక తెలిపారు. రెండు దశల పరీక్షల అనంతరం గురువారం వర్సిటీలో దీనిని ప్రదర్శించారు. పోర్టబుల్ బ్యాటరీ మెకానిజమ్ డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు.
ఈ–బైక్ ప్రత్యేకతలు ఇలా..
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిచే రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్.. పూర్తిగా చార్జింగ్ అవడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తే 35 కిలోమీటర్లు మేర చార్జింగ్ వస్తుంది. రివర్స్ సదుపాయంతో పాటు ఎలక్ట్రిక్ బ్రేక్‌ను అమర్చారు. బైక్‌ను తయారుచేసిన విద్యార్థులను వైస్ చాన్సలర్ డి.నారాయణరావు, ఆచార్య వజ్జా సాంబశివరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ నోరి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment