
పోలవరం వద్ద చురుగ్గా సాగుతున్న పనులు
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) తేల్చి చెప్పింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రాజెక్టు నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించాలని 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తి చూపింది. 2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కానే కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో ఏకీభవించింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2020 మార్చి 17న రివైజ్ట్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) సిఫార్సు చేసిన మేరకు.. 2017–18 ధరల ప్రకారం నిధులను విడుదల చేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖకు తేల్చి చెప్పింది. ఈ నెల 2న నిర్వహించిన అత్యవసర భేటీలో ఆ మేరకు చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జల్ శక్తి శాఖకు పంపింది.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై నిర్ణయాధికారం పీపీఏదే కావడంతో రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇవ్వడం లాంఛనమేనని జల వనరుల శాఖ అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఆమోదించాలని కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపనుంది. విభజన చట్టం సెక్షన్–90 ప్రకారం ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇందులో నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.43,164.83 కోట్లు, పోలవరం పనులకు 2014 ఏప్రిల్ 1 దాకా రూ.4730.71 కోట్లను ఖర్చు చేశారు. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.8,507.26 కోట్లను ఇప్పటి వరకు రీయింబర్స్ రూపంలో కేంద్రం విడుదల చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 2017–18 ధరల మేరకు పోలవరానికి ఇంకా రూ.29,926.86 కోట్లను విడుదల చేయాల్సి ఉంటుంది.
నాటి నుంచి నేటి వరకూ పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం
– 2009 జనవరి 20 : 2005–06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) ఆమోదం
– 2011 జనవరి 4 : 2010–11 ధరల ప్రకారం రూ.16010.45 కోట్లుగా మొదటి సారి సవరించి ఆమోదించిన సీడబ్ల్యూసీ టీఏసీ
– 2014 ఫిబ్రవరి 11 : 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా రెండో సారి సవరించిన సీడబ్ల్యూసీ టీఏసీ
– 2020 మార్చి 17 : 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసి.. కేంద్ర జల్ శక్తి శాఖ, ఆర్థిక శాఖలకు పంపిన ఆర్‌సీసీ
– 2020 నవంబర్ 2 : 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆమోదించాలని తేల్చి చెప్పిన పీపీఏ