
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకువెళ్లడంలో సఫలమయ్యారన్నారు. గురువారం ఆయన వెబినార్ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాలనా నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, ప్రధానంగా విద్యా సంస్కరణలను ప్రశంసించారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులతో వెబినార్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా కానుక, నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలు, విద్యా రంగంలో ప్రమాణాల పెంపునకు తీసుకున్న చర్యలు, కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూనే విద్యార్థులకు వివిధ మార్గాల్లో బోధనా కార్యక్రమాల కొనసాగింపు తదితర అంశాల గురించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా స్వాగతించిందని, అంతకు ముందు నుంచే పలు సంస్కరణల ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే అనేక చర్యలను తీసుకున్నామని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ స్పందిస్తూ మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
విద్యాభివృద్ధికి ఏపీ విశేష కృషి
♦మీ రాష్ట్రంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. విద్యాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. విద్యామృతం, విద్యాకలశం కార్యక్రమాలు అమలు చేస్తుండటం అభినందనీయం.
♦విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాలు బడి పిల్లల వరకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లడంలో మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఆదర్శవంతం.
♦గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం ముదావహం. అక్కడే ఆయా విభాగాలకు అధికారులను నియమించడం మంచిపని. ఇలాంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేకూరడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించడానికి వీలవుతుంది.
ఇతరులకూ ఆదర్శం
♦మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ఇతరులకూ ఆదర్శవంతంగా ఉన్నాయి. విద్యారంగంలో జీడీపీని ఆరు శాతానికి ఎలా తీసుకువెళ్లాలనేది విద్యా శాఖ మంత్రులందరూ ఆలోచించాల్సిన సమయం ఇది.
♦కొత్త బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యా మంత్రులు కేబినెట్ సమావేశాల్లో విద్యా రంగ ప్రాధాన్యతను తెలియజెప్పాలి. ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులందరూ జాతీయ విద్యా విధానం పట్ల సుముఖతతో ఉన్నారు.
♦అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిగణనలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలయ్యేలా సూచనలు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment