
లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అట్టర్‌ఫ్లాప్ అయింది. ‘అనంత’లో అదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో టీడీపీది అత్యంత బలహీన స్థితి. ఇక్కడ ‘యువగళం’ ఫెయిల్ అవుతుందని అధిష్టానానికి ముందస్తు సమాచారం ఉంది. జిల్లా నేతల్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదు. జన సమీకరణ చేయలేమని, ఖర్చు భరించలేమని చేతులెత్తేశారు. దీంతో అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగింది. జన సమీకరణకు ప్రణాళిక రచించి, పారీ్టనే ఖర్చు భరించేందుకు సిద్ధమైంది. దీనికి తగ్గట్లు కొందరి బాధ్యులను ఇప్పటికే కర్నూలుకు పంపి ఏర్పాట్లు చేస్తోంది. అయితే పార్టీ పరిస్థితి, నేతల తీరు చూస్తే కర్నూలు, నంద్యాల జిల్లాలలో యువగళానికి కష్టాలు తప్పేలా లేవు.
సాక్షిప్రతినిధి కర్నూలు: నారా లోకేశ్‌ను ప్రజల్లోకి పంపితే కనీసం కొద్దిమేరకైనా నాయకత్వలక్షణాలు మెరుగుపడతాయనే లక్ష్యంతో టీడీపీ చేస్తోన్న కార్యక్రమం యువగళం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ నెల 13న డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. డోన్ తర్వాత పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించి కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ముగించుకుని పాణ్యం నియోజకవర్గం ద్వారా నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నంద్యాల జిల్లాలో శ్రీశైలం, నందికొట్కూరు మినహా తక్కిన 5 నియోజకవర్గాల్లో సాగనుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోకి యాత్ర చేరుతుంది. అంటే ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. దాదాపు 40రోజుల పాటు యాత్ర సాగేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. అయితే యాత్రకు జనాలు వచ్చే పరిస్థితి లేదని టీడీపీ అధిష్టానం గ్రహించింది. దీంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది.
రోజూ రెండు షిఫ్ట్ లు...షిఫ్ట్ కు ఒక్కో కూలికి రూ.500!
లోకేశ్ పాదయాత్రకు జనాలు రావడం లేదు. దీంతో సోషియల్ మీడియాలో యాత్ర ‘అట్టర్‌ఫ్లాప్’ అని వైరల్ చేస్తున్నారు. చివరకు యాత్రకు మద్దతు ఇచ్చే పత్రికల్లో కూడా రోజూ జనాలు ఉన్న ఫొటోలు ప్రచురించలేనిస్థితి! టీడీపీకి గట్టి నాయకత్వం ఉందని భావించే అనంతపురం జిల్లాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కర్నూలు జిల్లాలో మరింత దారుణంగా పరిస్థితి ఉంటుందని పార్టీ గ్రహించింది. దీంతో యాత్రలో పాల్గొనేందుకు జనాలు సమీకరించేందుకు సిద్ధమైంది. రోజూ రెండు వేలమందికి తగ్గకుండా జనాలు సమీకరించే బాధ్యత ఇన్‌చార్జ్‌లకు అప్పగించింది. అంతమంది అంటే ఖర్చులు భరించలేమని ఇన్‌చార్జ్‌లు నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలీ పార్టీ చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయం వచ్చినవారు సాయంత్రం వరకూ ఉండటం కష్టం. దీంతో రెండు షిఫ్ట్‌లుగా జనాలను తరలించనున్నారు.
షిప్‌్టకు వెయ్యిమంది చొప్పున రోజూ 2వేలమందికి జనసమీకరణకే రూ.10 లక్షలు ఖర్చు చేయనున్నారు. వీరితో పాటు లోకేశ్ భద్రతా, ఇతర సిబ్బంది మరో 500 మందిదాకా ఉన్నారు. వీరందరికీ భోజనాల ఖర్చు మాత్రం ఇన్‌చార్జ్‌లే భరించాలని చెప్పారు. వీరి కూలీ, వాహనాల అద్దె ఖర్చులు మాత్రం పార్టీ చెల్లిస్తుంది. ముఖ్యంగా ఆదోని డివిజన్ నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయని, ఆ ప్రాంతం నుంచి కూలీలను తరలించడంపై దృష్టి సారించింది. దీంతో ఆయా గ్రామాల్లో టీడీపీ తరఫున వలంటీర్లు గ్రామాల్లో వెళ్లి ఆయా గ్రామాల్లో జనసమీకరణ చేయగలిగే వారిని కలుస్తున్నారు. ఈ నెల 13 లేదా 14 తేదీ నుంచి రోజూ తమకు ఎంతమంది అవసరం? కూలీ తదితర వివరాలు చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయిలో జనాలను తరలించే వ్యక్తులకు రోజూ రూ.3వేలు చెల్లించాలి.
ఇప్పటికే ఒక విడత సమావేశం పూర్తి
యువగళం నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నేతలు అమర్‌నాథరెడ్డి, బీదా రవిచంద్ర జిల్లాలోని ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. రోడ్‌మ్యాప్, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. అయితే ఇన్‌చార్జ్‌ల నుంచి ఆశించినస్థాయిలో స్పందన కన్పించలేదు. దీంతో కర్నూలు పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వివరించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో జనసమీకరణపై అచ్చెన్నాయుడు ఆడియో రికార్డులు బయటకు రావడం, సోషియల్ మీడియాలో హల్‌చల్ చేసిన క్రమంలో కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని అచ్చెన్నాయుడు సూచించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment