ప్రేమంటే.. సూర్యునిలా ఉదయించి.. అస్తమించేది కాదు. కళ్లల్లో ఉదయిస్తుంది.. కనుమూసినా తోడుంటుంది.. ప్రేమ వేదంలాంటిది. చదవగలిగితే.. పరిపూర్ణతనిస్తుంది.. ప్రేమంటే అమ్మ పాలంత స్వచ్ఛత.. నాన్న మమకారమంత బాధ్యత. అందుకే.. ప్రేమలోతులో మునిగాక.. పైకి తేలడం అంత సులభం కాదంటారు చాలా మంది. ఆరాధన భావమో.. ఆకర్షణ స్వభావమో.. నచ్చిన మనసు ఎదురు పడితే.. చూపు భావం పలికిస్తుంది.. మౌనం భాషను కనిపెడుతుంది. మెచ్చిన నెచ్చెలి మనసు దోచే మాట చెప్పాలంటే ముహూర్తం చూసుకునే హృదయాలెన్నో ఉన్నాయి. అలాంటి వారందరికీ నేడు పండగ రోజు. ప్రేమ లోకంలో విహరిస్తున్న హృదయాలు చెట్టపట్టాలేసుకొని వలపు పాటలు పాడుకునే పండగే ప్రేమికుల దినోత్సవం. ఈ రోజు యువజంటలు కొత్త సంబరాలు చేసుకుంటాయి. ప్రేమ వివాహం చేసుకుని విజయవంతంగా జీవనం సాగిస్తున్న జంటలు.. తన అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకుంటాయి. –సాక్షి, విశాఖపట్నం
సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): స్నేహ బంధం.. ప్రేమగా అంకురించింది. పెద్దలు కాదన్న.. వారి ప్రేమ ఔననిపించి వివాహ బంధంతో ఒక్కటి చేసింది. అరకు ఎంపీ మాధవి, ఆమె భర్త శివప్రసాద్ లవ్‌స్టోరీ ఇది. 16 ఏళ్లు స్నేహితులుగా ఉన్న వీరు ఇంటర్ నుంచి కలసి చదువుకున్నారు. నవోదయ స్కూల్‌లో 10 తరగతి వరకు చదువుకున్న ఎంపీ మాధవి.. ఇంటర్ నుంచి బయట చదువుకున్నారు. అక్కడే ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా వీరి మధ్య స్నేహం చిగురించింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
2019 ఎన్నికల సమయంలో వీరి స్నేహం మరింత బలపడింది. అంతవరకు స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమికులుగా మారారు. తర్వాత వీరి అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పారు. రెండు వైపులా మొదట్లో వ్యతిరేకించినా.. నమ్మకమైన ప్రేమ ఇరుకుటుంబాలను అంగీకరించేలా చేసింది. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన కె. శివప్రసాద్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019 అక్టోబర్ 17న శరభన్నపాలెంలో వీరి వివాహం జరిగింది.
వివాహానికి ముందు ఒకరి ఇష్టాన్ని.. ఒకరు పంచుకుంటూ..
చివరి వరకు కలిసే జీవిస్తాం
ప్రేమ ఎంతో గొప్పది. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకుని.. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ప్రేమ జీవితకాలం చిగురిస్తూనే ఉంటుంది. మేమిద్దరం కలిసి చదివాం. ఇద్దరి ఇష్టాలను ఒక్కటిగా మలచుకున్నాం. మా ప్రేమను పెద్దలకు వివరించాం. వారు అంగీకరించారు. రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా.. కలిసే బతుకుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ధైర్యంగా ఉంటాం.
–ఎంపీ మాధవి, శివప్రసాద్ దంపతులు
ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు!
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇద్దరూ ఉన్నత విద్యావంతులే.. ఒకే బ్యాచ్‌లో విద్యాశాఖలో అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే స్నేహితులయ్యారు. వారి మధ్య స్నేహం ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చింది. కులాలు వేరైనా వారే వీరిని ఒక్కటి చేశారు. ఇదీ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, మధ్యాహ్న భోజనం పథకం రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి దంపతుల కథ. డీఈవో చంద్రకళ మాటల్లో ఈ కథ విందాం. 2008 గ్రూప్–1 బ్యాచ్‌లో సుబ్బారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ ర్యాంకర్. అదే బ్యాచ్‌లో నేను కూడా మంచి ర్యాంక్ సాధించాను. ఇద్దరం డిప్యూటీ డీఈవోలుగా ఉద్యోగాల్లో చేరాం.
డీఈవో చంద్రకళ, మిడ్ డే మీల్ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి దంపతులు
తెలంగాణ జిల్లాలో చెరో చోట ఉద్యోగాలు చేశాం. ఆ సమయంలో ఉద్యోగ రీత్యా శిక్షణ కార్యక్రమాలు, విధి నిర్వహణలో భాగంగా తరచూ కలుస్తుండటంతో.. స్నేహితులయ్యాం. ఈ విషయం ఇద్దరి ఇంట్లోనూ తెలుసు. ఆయన ఓ సందర్భంలో నా తల్లిదండ్రులతో సరదాగా పెళ్లి ప్రస్తావన లేవనెత్తారు. ఈ విషయం నా తల్లిదండ్రులు ఆయన కుటుంబ సభ్యులకు చెరవేశారు. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నేనూ ఒకే చెప్పాను. అలా మా ఇద్దరికీ 2009లో వివాహం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మా స్వగ్రామం. ఆయనది కడప జిల్లా. మాకు ఇద్దరు కుమారులు. ఒకే బ్యాచ్, ఒకే కేడర్ ఉద్యోగాలు కావడంతో మా మధ్య ఏర్పడిన స్నేహం.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంగా మారిందని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment