ముల్లు.. అది గులాబీ ముల్లైనా, పిచ్చి పొదల్లో ముల్లైనా.. చివరికి చేప ముల్లైనా గుచ్చుకుంటుందని భయపడతాం. గులాబీని వాడేటప్పుడు, చేపలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. కానీ పొందూరు ఖాదీ నేతకార్మికులు ఆ ముల్లు లభించక తల్లడిల్లుతున్నారు. వారికి అవసరమైన కృత్రిమ ముళ్ల తయారీకి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఆఫ్ట్రాల్ ఒక ముల్లు కోసం ఇన్ని మల్లగుల్లాలా! ఏమిటి దాని గొప్ప? అని వెటకారం చేయకండి.. చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదు.
ఖాదీ వస్త్రాలు ఆ నునుపు, మెరుపు సంతరించుకోలేవు మరి! అలాగని అన్ని చేపల ముళ్లు పనికిరావు. ఖాదీ వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడి కొండపత్తిలోని పొల్లు తీసి శుభ్రం చేసేందుకు వాలుగ చేప ముల్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ చేప దవడ పలువరుసతో ఉండే ప్రత్యేకమైన ముల్లు లభించక దాని ప్రభావం ఖాదీ నేతపై పడుతోంది. అందుకే వాలుగ చేప ముల్లును పోలి ఉండేలా కృత్రిమ పరికరం తయారీకి ఒక సీనియర్ సైంటిస్ట్, ఒక యువజన సంఘం, ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి.
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖాదీ తయారీలో కీలకమైన.. పత్తిని శుభ్రం చేసేందుకు వినియోగించే.. వాలుగ చేప దవడ భాగం అవసరానికి తగినంతగా లభ్యం కావడం లేదా? ఆ చేప ముల్లును సేకరించడం కష్టతరంగా మారిందా..? ఆ ముల్లుకు ప్రత్యామ్నాయాలను రూపొందించే పనిలో సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఏమిటీ వాలుగ.. ఎందుకీ వెలుగు..
వాలుగు చేప.. శాసీ్త్రయ నామం వల్లగో అట్టు. మంచినీటిలో పెరిగే చేప. మిగతా చేపల మాదిరిగా కాకుండా దవడ భాగం విభిన్నంగా ఉంటుంది. దవడలోని ఉండే మృదువైన పళ్లవరసే ఖాదీ వస్త్రం రూపొందించడంలో కీలకం. ఖాదీకి అంత తెలుపు రంగు తీసుకురావడంతో కూడా కీలక పాత్ర దీనిదే.
వినియోగం ఎలా..
వాలుగ చేప దవడ భాగాన్ని మత్స్యకారుల నుంచి సేకరిస్తారు. పైదవడను రెండు ముక్కలుగా, కింది దవడను రెండు ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కను ఓ చిన్న కర్రకు దువ్వెన మాదిరిగా కడతారు. దాని సాయంతో పత్తిని శుభ్ర పరుస్తారు. ఈ క్రమంలో పత్తి మృదువుగా తయారవడంతో పాటు మరింత తెలుపుగా మారుతుంది. ఎడమ చేతి వా టం ఉన్న నేత కారులు ఎడమ దవడను, కుడి చేతి వాటం ఉన్న వారు కుడి దవడను వినియోగించి పత్తిని శుభ్రపరిచేందుకు వినియోగించడం మరో విశేషం.
గతంలో రాజమండ్రి నుంచి..
తొలినాళ్లలో రాజమండ్రి ధవళేశ్వరం నుంచి కరకు సత్యమ్మ అనే మహిళ పొందూరు ఖాదీ కార్యాలయానికి వాలుగ చేప దవడల్ని సరఫరా చేసేవారు. ఆమె మరణాంతరం అక్కడ్నుంచి ముల్లు రావడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం పరిసరాల్లోని మత్స్యకారులు అడపాదడపా తెచ్చి విక్రయిస్తున్నారు.
ప్రత్యామ్నాయాల రూపకల్పనలో..
ఖాదీ తయారీలో వాలుగ చేప దవడ కీలకం కావడం.. అవసరమైన మేర లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మహరాష్ట్ర వార్ధాలోని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్(ఎంజీఐఆర్‌ఐ) సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ఓ బృందం స్టీల్‌తో వాలుగ చేప దవడ మాదిరిగా ఓ పరికరాన్ని రూపొందించింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎంఈ సంస్థ తయారుచేసింది. ఆ పరికరం పనితీరును పొందూరు ఖాదీ తయారీలో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కానీ వాలుగ చేప దవడతో వచ్చేంత మృదుత్వం ఈ పరికరంతో రాలేదు. నేతన్నల చేతులకు గాయాలవ్వడం.. ఇతర అంశాల కారణంగా ఆ పరికరం వినియోగంలోకి రాలేదు.
●అయినా సీనియర్ సైంటిస్ట్ మహేష్ కుమార్ ప్రత్యామ్నాయాలపై పట్టువిడవలేదు. చేప దవడ మాదిరిగానే ఉండేలా సన్నని ప్లాస్టిక్ సూదుల్ని స్విట్జర్లాండ్‌లో, దవడ భాగాన్ని థాయ్‌లాండ్‌లో రూపొందించి మరో కొత్త పరికరాన్ని రూపొందించారు. కానీ ఈ పరికరం ఖర్చు ఎక్కువగా ఉండడంతో.. ఖాదీ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపించారు.
● జిల్లాకు చెందిన పొగిరి జశ్వంత్‌నాయుడు (చైన్నె ట్రిపుల్ ఐటీ, ఐఐఎం అమృత్‌సర్ పూర్వ విద్యార్థి) బృందం కూడా ప్రత్యామ్నాయ పరికరంపై దృష్టిసారించింది. ఐఐఎం అమృత్‌సర్ వేదికగా ఐదుగురు సభ్యుల బృందం త్రీడీ టెక్నాలజీ సాయంతో మోడల్‌ను రూపొందించింది. ప్లాస్టిక్‌ది కావడం.. ఇతర అంశాల వల్ల ఇదీ సఫలీకృతం కాలేదు. ఈ బృందం మరిన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
● పొందూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం(ఏఎఫ్‌కేకే) వాలుగ చేప సేకరణకోసం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. వాలుగ సేకరణ కష్టంగా మారడంతో దానిని పోలి ఉండే మరో రకం చేపపై దృష్టిసారించారు. హిరమండలం రిజర్వాయర్‌లో వీటిని సేకరించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దీని వినియోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. త్వరగా విరిగిపోవడం, అరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీనిని వినియోగిస్తున్నారు.
ప్రయత్నం చేస్తున్నాం..
పొందూరు ఖాదీలో కీలకమైన వాలుగ చేప దవడ భాగం సేకరణ కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయాల దిశగా ఐఐఎం అమృత్‌సర్ వేదికగా మా టీమ్ దృష్టి సారించింది. ప్రాఫెసర్‌తో సహా ఐదుగురు సభ్యులు ఓ పరికరాన్ని రూపొందించాం. కొన్ని ఇబ్బందులు గమనించాం. పూర్తి పర్యావరణ హితమైన మెటీరియల్‌తో తయారు చేసేందుకు మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. – పొగిరి జశ్వంత్ నాయుడు, స్టేటజీ కన్సల్టెంట్, ఈవై
శిక్షణ తీసుకున్నాం..
కృత్రిమ చేప ముల్లుతో పత్తిని శుభ్రం చేసే ప్రక్రియను నేర్చుకునేందుకు హైదరాబాదుకు వెళ్లాం. దీని వినియోగంతో నాణ్యమైన 100 కౌంటు దారం రాదు. ఈ కృత్రిమ ముల్లుతో చేయడం వల్ల చేతి వేళ్లకు గాయాలై రక్తం వచ్చేది. అందుకే దీనిని వినియోగించలేదు.
–కాపల కుమారి, చేనేత కార్మికురాలు
ఆ రిజర్వాయర్‌లో గుర్తించాం..
విదేశీ సాంకేతికతతో తయారు చేసిన ప్రత్యామ్నాయ పరికరం ఖరీదు రూ.750 వరకు ఉంది. అదే వాలుగ చేప దవడ అయితే కేవలం రూ.25 నుంచి రూ.50 వరకు ఉంది.వాలుగ చేప శాస్త్రీయ నామం వల్లగో అట్టు. ఇది మంచి నీటి చేప. మా అధ్యయానాల్లో వాలు గు చేపలు మడ్డువలస రిజర్వాయర్‌లో విస్తృతంగా ఉన్నాయి. చాలా పెద్ద సైజుల్లోనే లభ్యమవుతున్నాయి. –డాక్టర్ కర్రి రామారావు,జీవవైవిధ్య శాస్త్రవేత్త, డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం
కొరత వాస్తవమే..
పొందూరు ఖాదీకి కీలకమైన వాలుగ చేప దవడ కొరత వాస్తవమే. చాలా మంది ప్రత్యామ్నాయాల వేటలో ఉన్నారు. కానీ అవి సఫలీకృతం కాలేదు. మా వంతుగా ఇటీవలే హిరమండలం రిజర్వాయర్‌లో వేరే రకం చేపను వినియోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. వాలుగుకు ఏదీ సాటి రాదు.
–డి.వెంకటరమణ, సెక్రటరీ, ఏఎఫ్‌కేకే, పొందూరు
వాలుగుకు ఏదీ సాటిరాదు.
పత్తిని శుభ్రం చేసేందుకు వాలుగ చేప దవడకు ప్రత్యామ్నాయం లేదనే చెబుతున్నారు నిపుణులు. ఆ సున్నితత్వం.. ఆ శ్వేతవర్ణం వాలుగుకు ఏదీ సాటిరాదంటున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో వాలుగ చేపలు ఉన్నాయని జీవవైవిధ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులకు దీని వినియోగంపై విస్తృతమైన అవగాహన కల్పించి వారితో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా కూడా ఖాదీ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment