
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక జీ–20 సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. జీ–20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఏపీ నుంచి విశాఖపట్నాన్ని కేంద్రం ఎంపిక చేసింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, ఏప్రిల్ 24న విశాఖ వేదికగా వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించే జీ–20 సదస్సుకు నోడల్ అధికారిగా ప్రొటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని, సెక్యూరిటీ నోడల్ అధికారిగా డీజీపీని నియమించారు. విశాఖలో సదస్సు జరిగే మూడు రోజుల్లో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికారులు చెప్పారు.
వేలాది మంది ప్రతినిధులు హాజరవుతారని.. వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. తదనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఇప్పటికే కలెక్టర్ డా.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి.. జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. సదస్సు నిర్వహణకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేసి.. జేసీ విశ్వనాథన్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్ హోటళ్లలో 703 గదులను రిజర్వ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అతిథులు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment