సాక్షి, అమరావతి :వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక సమాచార బోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. ఏ పథకంలో ఎంతమంది లబ్ధిదారులకు.. ఎంత మొత్తం లబ్ధిచేకూరిందన్న వివరాలను ఆ సమాచార బోర్డులలో ప్రదర్శిస్తారు.
నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 3,842 వార్డు సచివాలయాల వద్ద ఎక్కడిక్కడ నగర, పట్టణ, జిల్లా, మండల, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ ‘ప్రగతి సమాచార బోర్డు’లను ఆవిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది.
రెండు మూడ్రోజుల్లోనే ఏ సచివాలయానికి సంబంధించిన సమాచార బోర్డును ఆయా సచివాలయానికి పంపేందుకు అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
వాట్సాప్ ద్వారా ప్రజలకు సమాచారం..
ఇక ఈ సంక్షేమ పథకాల సమాచార బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయనున్నారు. సచివాలయాల వారీగా ప్రతి కుటుంబానికి ముందుగానే వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖాధికారులు చెప్పారు. వీటి ఆవిష్కరణ అనంతరం ఓ పది రోజులపాటు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివిధ పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వం ఎంతమేర లబ్ధిచేకూరుస్తోంది తెలియజేసి, ఆ కుటుంబంలో ఒక సభ్యుని నుంచి ఈ–కేవైసీ రూపంలోధ్రువీకరణ తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment