
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బాట పట్టింది. వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పించి, లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్రం జాతీయ స్థాయిలో చేపడుతోంది. మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి చేయూతనిస్తూ ప్రకటించిన పలు కార్యక్రమాలు ఏపీలో వైఎస్ జగన్ సర్కారు ఇప్పటికే అమలులోకి తెచ్చింది.
► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అనుసంధానంగా 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్) రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ.139.46 కోట్లతో 2,896 సీహెచ్‌సీలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. కేంద్రం ఇదే తరహాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ) మద్దతుతో అద్దె ప్రాతిపదికన యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తేనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.
► రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా రైతుల్లో నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ తరహాలోనే కేంద్రం రైతులకు డిజిటల్, హైటెక్ సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ పరిశోధన, విస్తరణ సంస్థలు, ప్రైవేట్ అగ్రి–టెక్ ప్లేయర్లు, అగ్రి–వాల్యూ చైన్ వాటాదారుల భాగస్వామ్యంతో పీపీపీ మోడ్‌లో ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించింది.
► ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది ఏపీ. సేంద్రీయ పాలసీని తీసుకొచ్చే దిశగా అడుగులేస్తోంది. కేంద్రం కూడా ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. యూనివర్శిటీ స్థాయిలో నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్న కేంద్రం రసాయన రహిత సహజ వ్యవసాయ విధానంపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపింది.
► ఏపీలో వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మిల్లెట్ పాలసీని తీసుకొస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తోంది. కేంద్రం తాజా బడ్జెట్‌లో చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తూ 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. వీటి సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. చిరు ధాన్యాల వినియోగం పెంచి, జాతీయంగా బ్రాండింగ్ చేయాలని నిర్ణయించింది.
► ఏపీ ప్రభుత్వం ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తూ మరే రాష్ట్రంలో లేని రీతిలో ప్రత్యేకంగా గిట్టుబాటు ధర కల్పిస్తోంది. రెండున్నరేళ్లలో కొత్తగా 59 వేల ఎకరాలు సాగులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఆయిల్ పామ్‌పై సమగ్ర పథకాన్ని తీసుకొస్తోంది.
► రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ద్వారా వాటికి అదనపు విలువను జోడించే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చింది. రూ. 2,389 కోట్లతో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతోంది. కేంద్రం కూడా ఇదే తరహాలో పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్ర ప్యాకేజీని అందిస్తామని ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల (స్టార్టప్) ఏర్పాటుకు ఆర్థికంగా చేయూతనిస్తామని తెలిపింది.
► ఏపీలో ఇప్పటికే అమలవుతున్న భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్‌ల ద్వారా పురుగుల మందులు, పోషకాల పిచికారీ కూడా జాతీయ స్థాయిలో అమలు చేయబోతున్నారు. పంట అంచనా కోసం కూడా వీటిని వినియోగించాలని కేంద్రం సంకల్పించింది. ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసే లక్ష్యంతో ఏపీలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment