సాక్షి వెబ్‌డెస్క్: 12 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారునిగా మాత్రమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ తెలుసు. ‘నన్ను అణచివేయాలని చూస్తే పడిలేచిన కడలి కెరటంలా పైకి ఎగసిపడతాను. గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంతో తిరిగి వస్తాను’ అన్న జగన్ ఆ మాటల్ని నిజం చేసుకున్నారు.
ఎన్నో సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ప్రజా సేవే పరమావధిగా మొక్కవోని విశ్వాసంతో సీఎం వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయువుగా దేశంలోనే ఆదర్శ సీఎంగా ఎదిగారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, గత టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని పోరాట యోధుడిగా ఎదురు నిలిచి అకుంఠిత దీక్షకు సంకేతంగా మారారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు సహకరించపోయినా.. సంకల్పబలంతో ముందుకుసాగుతున్నారు. రెండున్నరేళ్లలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్నారు. ఒక వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు.. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తూనే, మరోవైపు సంక్షేమాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు.
విలువలకు కట్టుబడి..
2009లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. సీఎం జగన్ ఇష్టపడలేదు. విలువలకే కట్టుబడ్డారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హఠాన్మరణంతో. నాడు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు ఆయనకు సూచించారు. కానీ ఆయన సమ్మతించలేదు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని వైఎస్ జగన్ రాజకీయ విలువలకు కట్టబడ్డారు.
ఓదార్పు యాత్ర..
ఇచ్చిన మాట కోసం పార్టీకి రాజీనామా చేయడమే కాదు. ఎంపీ పదవిని సైతం వైఎస్ జగన్ తృణప్రాయంగా వదిలేశారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కడప స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని వీడారు. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేశారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని వారికి కొండంత భరోసా ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం..
రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొద్దినెలలకే 2011 కడప పార్లమెంట్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో రికార్డు విజయం సాధించారు.
కుట్రపూరితంగా..
రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు. రైతు దీక్ష, జలదీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష ధర్నాలతో ఉద్యమించారు. ఆయనను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై కుట్రపూరితంగా వ్యహరించి అక్రమ కేసులు బనాయించారు.
టీడీపీ అవినీతిపై పోరాటం..
2014 ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి, అసమర్థతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా టీడీపీ ఎన్నో కుట్రలు పన్నింది. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి చంద్రబాబు టీడీడీలో చేర్చుకున్నారు.
ప్రజా సంకల్పయాత్ర..
అవినీతి, అసమర్థ పాలనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేందుకు వైఎస్ జగన్ చారిత్రాత్మక ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలగుండా సాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ నడక సాగించారు.
ముఖ్యమంత్రిగా..
2019 మే 30న నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అపూర్వ ప్రజా మద్దతుతో 151 అసెంబ్లీ సీట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ రథ సారథిగా, అభివృద్ధి కాముకుడిగా పాలన సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment