నేడు... రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఉన్న వ్యవస్థలను అత్యంత ప్రభావవంతం చేయడంతో పాటు, ప్రజల కోసం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న తీరూ విప్లవాత్మకం. అందుకే సంక్షేమ రంగానికి సంబంధించినంత వరకూ ప్రగతి గురించి చెప్పుకోవాలంటే జగన్‌కు ముందు, జగన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ కారణంగానే యావత్ భారత దేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.
జగన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలోనే ఎవరూ పూర్తిగా గుర్తు పెట్టుకోలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ ఉన్న వ్యవస్థల పని తీరును ప్రభావితం చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయగలిగారు. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే పథకాలు గత ప్రభుత్వాల హయాంలోనూ ఉన్నాయి. అయితే అప్పట్లో పెన్షన్ మంజూరు కావడం, పెన్షన్ మొత్తాలు చేతికి అందడం పెద్ద ప్రహసనంగా ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అర్హత కలిగిన వారికి పెన్షన్ల మంజూరు చాలా సులభతరంగా మారింది. కచ్చితంగా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి కొచ్చి తలుపుతట్టి పెన్షన్ మొత్తాలను అందించే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడింది. పెన్షన్లను మాత్రమే కాదు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం తదితర చౌక వస్తువుల కోసం దుకాణాల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి ముంగిటకే రేషన్ వాహనాలను తెచ్చి పెట్టారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ‘దిశ యాప్’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అందరి మన్ననలూ పొందుతోంది.
గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నా... లబ్ధిదారులకు ఆ ఫలాలు చేరడానికి దళారీ వ్యవస్థ వాహకంగా ఉండేది. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం.. పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే సంక్షేమ పథకాల అజెండాగా జగన్ పెట్టుకున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ‘డీబీటీ’ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్) విధానం సీఎంగా జగన్ రాకతోనే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయ డంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లి దాని కారణంగా ఎవరైనా అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే అలాంటివారు ఎప్పుడైనా ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే వెసులుబాటు కలిగించారు.
గతంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు లాంటివి తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవ స్థకు రూపకల్పన చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్, ఈడబ్లు్యఎస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లను ఈ రోజున ప్రజలు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవ రినీ కలవాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సులభంగా అందుకోగలుగుతున్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ల స్థలాలను అందించడం కూడా సచివాలయాల ద్వారా మత్రమే సాధ్యమైంది. సచివాలయాలకు అనుబంధంగా సీఎం జగన్ సృష్టించిన 2.56 లక్షల మంది ‘వాలంటీర్ల’ వ్యవస్థ... సిఫార్సులు, పైరవీలను పాతరేసింది. వ్యవసాయానికి వెన్ను దన్నుగా రైతుకు విత్తనాలు అందించడం దగ్గర నుంచి వ్యవసాయోత్పత్తుల అమ్మకాల దాకా ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా కేంద్రాలు’ (ఆర్‌బీకే) కూడా ఈ రోజున దేశ, విదేశీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కోరుకున్న సమాజం దిశగా ప్రభుత్వ ఫలాలు అట్టడుగువర్గాల వారికి చేరాలంటే పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది. ఏ వర్గాలైతే ఇంత కాలం అణచి వేయబడ్డాయో, ఏ వర్గాలైతే ఇంత కాలం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కుతోంది.
శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానవ్‌ుకు అవకాశం ఇచ్చారు. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ‘బీసీ కమిషన్’తో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, దాన్ని అమలు చేసిన తొలి ప్రభుత్వం జగన్‌దే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా జగన్ సర్కార్‌దే.
గత మూడేళ్ల కాలంలోనే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్‌లతో కలిపి ఇప్పటి వరకూ 2.61 లక్షల ఉద్యో గాలను బీసీ వర్గాల వారికి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన 1.30 లక్షల శాశ్వత ఉద్యో గాలలో 83 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమే. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను చూసి ‘మేము కూడా ఈ సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే బాగుండేద’నే భావన ఈ రోజున అగ్రవర్ణాల వారిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలి!
డా‘‘ మేరుగు నాగార్జున
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment