షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు: వైఎస్సార్‌ సోదరి విమల | YSR Sister YS Vimala Key Comments Over Viveka Case | Sakshi
Sakshi News home page

షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు: వైఎస్సార్‌ సోదరి విమల

Published Sat, Apr 13 2024 9:56 AM | Last Updated on Sat, Apr 13 2024 11:09 AM

YSR Sister YS Vimala Key Comments Over Viveka Case - Sakshi

వైఎస్‌ ఇంటి ఆడపడుచులు ఇలా మాట్లాడడం బాధగా ఉంది

నేనూ ఆ ఇంటి ఆడపడుచుగా వాళ్లను నిలదీస్తున్నా

వివేకాను అవినాష్‌ చంపడం ఆ ఇద్దరూ చూశారా?

హంతకుడి మాటలు విని ఆరోపణలు చేస్తారా?

అవినాష్‌ ప్రజల మనిషి.. కడప కోసం ఎంతో చేశాడు

సీఎం జగన్‌ను కూడా ఇందులోకి లాగుతున్నారు

సీఎం అయ్యాక జగన్‌ బంధువర్గాన్ని దూరం పెట్టారు

వ్యక్తిగత కక్షతోనే ఆ అక్కాచెల్లెలు ఇలా చేస్తున్నారు

షర్మిలకు లీడర్‌షిప్‌ క్వాలిటీ ఎక్కడుంది?

జగన్‌ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారు

మేనత్తగా చెబుతున్నా.. మీరు చేస్తోంది కరెక్ట్‌ కాదు.. ఇకనైనా నోరు మూస్కోండి

షర్మిల, సునీత తీరుపై వైఎస్సార్‌ సోదరి విమల ఆగ్రహం

సాక్షి, విజయవాడ: వైఎస్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైఎస్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని వైఎస్సార్‌ సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్‌ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని అన్నారామె.

వైఎస్‌ విమల శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?.. 

.. షర్మిలకు లీడర్‌షిప్‌ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైఎస్సార్ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు

.. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు. వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు

.. కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా?. వైఎస్సార్ ఉన్నపుడు వివేకానంద రెడ్డి కడప చూసుకున్నారు. ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు. మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు. శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్ పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు. షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి వాళ్లిద్దరూ ఇదంతా చేస్తున్నారు. 

.. జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి.  అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి’’ అని విమల ఏపీ ప్రజల్ని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement