వివేకా వర్థంతి సాక్షిగా బట్టబయలైన రాజకీయ కుట్ర
సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల...అంతా పచ్చ తానులో ముక్కలే
చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం
మొదటి నుంచి సౌభాగ్యమ్మ, సునీతది రాజకీయ ఆకాంక్షే
అదే ఆరాటంతో చంద్రబాబు బృందంతో కుమ్మక్కు
వివేకా ప్రత్యర్థులు, హంతకుల ముఠాతో జట్టు కట్టిన వైనం
వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు
ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ పచ్చ ముసుగులు తొలిగాయి! వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తమ రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టుకున్నారు. తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, కొంతకాలంగా తాము చదువుతోంది చంద్రబాబు స్క్రిప్టేనని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సాగుతున్న పచ్చ కుట్రలో తాము భాగస్వాములమని తేల్చేశారు.
టీడీపీ తరఫునో, ఆ పార్టీ మద్దతుతోనో ఎన్నికల్లో పోటీ చేయడమే తమ ఆంతర్యమని కుండబద్ధలు కొట్టారు. ఇక షర్మిల కూడా తానూ ఆ పచ్చతానులో ముక్కనేనని విస్పష్టంగా ప్రకటించారు. వైఎస్ వివేకా ఐదో వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల ఒకే లయ... ఒకే తాళంతో చంద్రబాబు ఐదేళ్లుగా పాడుతున్న పాచిపాటనేమళ్లీ పాడారు. –సాక్షి, అమరావతి
సునీత... షర్మిల... సౌభాగ్యమ్మ
బాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా... వైఎస్ వివేకా 2019 మార్చి 15న హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథను ప్రజలు ఎన్నికల్లో తిప్పికొట్టారు. దాంతో ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వివేకా కుటుంబ సభ్యులతో పలికించే కుయుక్తులకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతను రంగంలోకి దించారు. ఆ డ్రామా దాదాపు మూడేళ్లకుపైగా కొనసాగిన తరువాత చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల రాజకీయ తెరపైకి వచ్చారు.
సునీత నిరాధార ఆరోపణలనే ఆమె కూడా వినిపిస్తున్నారు. ఈ నాటకం రక్తి కట్టకపోవడంతో చివరి పాత్రధారిగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఆమె పాత్రను ప్రవేశపెట్టడం చంద్రబాబు టైమింగ్‌కు నిదర్శనం. ఎన్నికల వేళ సౌభాగ్యమ్మ, సునీత తమలో గూడుకట్టుకున్న రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం సీఎం రమేశ్ ద్వారా చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కడప ఎంపీగా పోటీ చేయాలనే తమ ఆకాంక్షను గుర్తుచేశారు.
నాలుగేళ్లుగా ఈ డ్రామా నడుపుతున్న చంద్రబాబు అందుకు సరే అన్నారు. వారం క్రితమే నర్రెడ్డి సునీత తానుగానీ తన తల్లి గానీ ఎన్నికల్లో పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీని ఓడించాలన్నారు. పచ్చ సీరియల్‌లో తరువాత ఎపిసోడ్ వివేకా వర్ధంతి కార్యక్రమాన్ని పులివెందులలో పక్కా స్క్రిప్ట్‌తో నిర్వహించారు. అందులో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
రాజకీయ వారసత్వం
రెండో వివాహంతో రగడ
వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తాను రెండో వివాహం చేసుకున్న షమీమ్ అనే మహిళకు ఆస్తిలో వాటా ఇవ్వడంతోపాటు ఆమె ద్వారా జన్మించిన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా భావించారు. దీన్ని సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ వివేకా ఆస్తితోపాటు రాజకీయ వారసత్వం తమకే దక్కాలని పంతం పట్టారు.
వివేకా హత్య తరువాత ఆయన పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తులను సునీత హడావుడిగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్తులు హస్తగతమయ్యాక రాజకీయ వారసత్వంపై సౌభాగ్యమ్మ, సునీత కన్నేశారు. వివేకా జీవితాంతం రాజకీయంగా విభేదించిన చంద్రబాబుతో చేతులు కలిపారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి పులివెందులకే చెందిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలపట్ల నాలుగేళ్లుగా సౌభాగ్యమ్మ, సునీత సన్నిహితంగా ఉంటున్నారు.
హత్య అనంతరం...
ఆద్యంతం సందేహాస్పదం
వైఎస్ వివేకా హత్య అనంతరం సౌభాగ్యమ్మ, సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వ్యవహరించిన తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019, మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడులకు సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు.
అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాను హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు.
ఆ రోజు మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అందచేశారు. లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా? అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం.
ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగయ్య చెప్పిన వివరాల ప్రకారం 2019, మార్చి 14 అర్ధరాత్రి వివేకాను హత్య చేసిన తరువాత హంతకులు ఆ నివాసంలో ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం వెతికారు. దీంతో వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టమైంది. వివేకా ఆస్తి కోసం, రాజకీయ వారసత్వం కోసమే ఆయన సొంత కుటుంబ సభ్యులే ఈ హత్యకు పన్నాగం పన్ని ఉంటారన్నది స్పష్టమవుతోంది.
బద్ధశత్రువులతో
ఒకే వేదికపై
పులివెందులలో శుకవ్రారం నిర్వహించిన వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీతతోపాటు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వివేకాకు జీవితాంతం బీటెక్ రవి ప్రత్యర్థిగానే ఉన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా ఓడించారు.
ఆ రాజకీయ కుట్రను ఆదినారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. 2019లో వివేకాను హత్య చేసివారికి వీరిద్దరూ పూర్తి అండదండలు అందిస్తున్నారు. అటువంటి వారు సౌభాగ్యమ్మ, సునీతకు అత్యంత ఆప్తులయ్యారు. వారిద్దరినీ ఆహ్వానించి వివేకా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం విభ్రాంతికరమే కాదు రాజకీయాలంటేనే జుగుప్స కలిగిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒంటరిని చేసి..
పస్తులు ఉంచి..
వివేకా జీవించి ఉండగా ఆయన్ని పట్టించుకోని కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. హత్యకు గురి కావడానికి చాలా ఏళ్ల ముందు నుంచే వివేకాను ఆయన సతీమణి, కుమార్తె, అల్లుడు విస్మరించారు. వివేకా షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సౌభాగ్యమ్మ, సునీత ఆయన్ని చాలా ఏళ్లుగా పులివెందులలో ఒంటరిగా వదిలేశారు. సౌభాగ్యమ్మ చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు.
వివేకా చెక్ పవర్‌ను కూడా రద్దు చేసి ఆయన రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి కల్పించారు. వివేకాకు ఇంట్లో వండి పెట్టేవారే లేని దుస్థితి కల్పించారు. చివరికి రెండు చపాతీలు కూడా ఇచ్చేవారు లేక ఆయన పనివాళ్ల మీద ఆధారపడాల్సి వచ్చేది. తిండి లేకుండానే నిద్రపోయిన రోజులూ ఉన్నాయి. ఈ విషయాలేవీ ఎవరికీ తెలియవన్నట్టుగా సౌభాగ్యమ్మ, సునీత వ్యవహరించి నిజాలకు పాతరేసేందుకు యత్నించారు.
బీటెక్ రవి
సాగని ఆటలు
పులివెందుల నియోజకవర్గంలో కొద్దోగొప్పో పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చని పథకం వేశారు. కానీ నాడు వివేకా వైఎస్సార్‌సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు.
ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి (ఈయనతో వివేకాకు ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నార్కో పరీక్ష నిర్వహించాలని సిట్ దర్యాప్తులో నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి మొండికేయడం సందేహాస్పదమే.
దస్తగిరి..
హంతకుడి హైడ్రామా
వివేకాను ఎంత పాశవికంగా హత్య చేశాడో పూసగుచ్చినట్లు చెప్పిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం ఎవరికైనా విభ్రాంతి కలిగించకమానదు. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నాడన్నది నిర్ధారణ అయ్యింది. అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... దీని వెనుక ఎవరున్నారన్నది కీలకం.
చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి... ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కోసం కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు. దస్తగిరి దుష్ప్రచారాన్ని పదేపదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. మరి దస్తగిరి కట్టుకథలు, అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!
Comments
Please login to add a commentAdd a comment