కూటమి ప్రభుత్వం చట్టాన్ని లెక్క చేయడంలేదు
హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్‌సీపీ ఆఫీసు భవనం కూల్చేశారు
వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చట్టాన్ని లెక్క చేయడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం భవనాన్ని కూల్చేశారని మండిపడ్డారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన తొలిరోజు నుంచే నియంతృత్వ ధోరణితో సాగుతోందని అన్నారు.
చంద్రబాబు నివసిస్తున్నదే అక్రమంగా కట్టిన కరకట్ట నివాసంలో అని, దాన్ని కూల్చేస్తామని గతంలో అదే పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా∙చెప్పారని తెలిపారు. అదే అక్రమ కట్టడంలో ఉంటూ చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చి న దగ్గర నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి నేతలు హింసాకాండకు పాల్పడటం ఈ ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెప్తున్నాయన్నారు.
ఇప్పుడు ప్రభుత్వమే వైఎస్సార్‌సీపీ కార్యాలయాల ధ్వంసానికి దిగిందన్నారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ఉందా? చట్టం పనిచేస్తోందా? వ్యవస్థలు ఉన్నాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయన్నారు. శనివారం అసెంబ్లీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తేనె పలుకులు పలికారని, బయట మాత్రం కత్తులతో ప్రత్యర్థి రాజకీయ పార్టీ గొంతు కోయాలని చూస్తున్నారని చెప్పారు.
సభ ఎలా జరుపుతారో అయ్యన్న నియామకమే చెబుతుంది
ఎక్కువ బూతులు మాట్లాడేదెవరని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అయ్యన్నపాత్రుడినే చూపిస్తోందని, అలాంటి వ్యక్తిని స్పీకర్‌గా నియమించారంటే సభను ఎలా జరపాలనుకుంటున్నారో అర్థమవుతోందని సుధాకర్‌బాబు అన్నారు. తన స్నేహితుడితో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలియాలంటూ సుధాకర్‌బాబు ఆ వీడియోను ప్రదర్శించారు.
జగన్ కేవలం ఓడిపోయాడు కాని, చావలేదు, చచ్చేవరకూ కొట్టాలంటూ అత్యంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూటమి పార్టీలు కూర్చోపెట్టాయని ధ్వజమెత్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న స్పీకర్ విపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులను మాట్లాడనిస్తారా.. అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను అవమానించటానికి, ఆయన ఆస్తులను ధ్వంసం చేయడానికే చంద్రబాబు సీఎం అయ్యారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment