
టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తపై దౌర్జన్యానికి దిగారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, కార్మిక సంఘాలు రెండు రోజుల నిరసనలకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ నిరసనల్లో భాగంగా గాజువాక జంక్షన్ లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. రసాభాస సృష్టించారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ నినాదాలు చేశారు. దీనిపై నిలదీసిన రోజా అనే వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తపై తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఈ వ్యవహారం నేపథ్యంలో.. గాజువాక జంక్షన్ లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు నచ్చ చెప్పడంతో కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ ఘటనలో టీడీపీ నేతల తీరు పై గాజువాక ప్రజలు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తేవాల్సిన కార్యకర్తలు ఆ పని చేయకపోగా.. పైగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఘోరంగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మండిపడ్డారు.