
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం సోమవారం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆలయాల్లో వాడిన పూలతో అగరబత్తీలు తయారీని ప్రారంభించామని తెలిపారు. ఎలాంటి లాభాపేక్షలేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోందన్నారు. తిరుపతి, తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు.
‘‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చాం. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నామని’’ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీల విక్రయానికి టీటీడీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment