తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అన్నారు. ఇకపై ఇలా ప్రతియేటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే.. కరోనా కారణంగా మాడ వీధుల్లో నిర్వహించలేకపోయిన బ్రహ్మోత్సవ వాహన సేవలను రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈనెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని.. పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది.
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, సనత్‌కుమార్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం.. సమావేశ నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
► సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వానికి రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు కొనుగోలు చేశాం. భవిష్యత్ అవసరాలకు ఈ స్థలం పక్కనే ఉన్న మరో 132 ఎకరాల స్థలాన్ని రూ.25 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించాం.
► శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డి) కౌంటర్లు ప్రారంభిస్తాం. 20వేల వరకు టోకెన్లు జారీచేస్తాం.
► శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉ.10 గంటలకు మార్చాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాల తరువాత దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం.
► తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల తరువాత ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా మొదలుపెడతాం.
► తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించని భక్తుల కోసం అక్కడక్కడా జర్మన్ షెడ్లు ఏర్పాటుచేశాం.
► భక్తులకు అందించే శ్రీవారి నైవేద్య ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను ఏపీ మార్క్‌ఫెడ్, రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలుకు అంగీకరించాం. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయించాం.
► తిరుమలలోని గోవర్థన సత్రాల వెనుక భాగంలో పీఏసీ–5 నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్ టెండర్లకు ఆమోదించాం. తద్వారా మరింత మంది భక్తుల వసతికి అవకాశం కలుగుతుంది.
► వకుళమాత ఆలయం నుంచి పుదిపట్ల జూపార్క్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.. ఇందుకోసం స్థలం సేకరించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.
► తిరుమల నందకం విశ్రాంతి గృహంలో ఉన్న 340 గదుల్లో నూతన ఫర్నిచర్ ఏర్పాటు నిమిత్తం రూ.2.45 కోట్లు మంజూరు.
► తిరుమలలో సామాన్య భక్తుల కోసం గదుల ఆధునీకరణ పనుల్లో భాగంగా గీజర్ల ఏర్పాటు. వీటి కోసం అదనపు లోడు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ.7.20 కోట్లతో టెండర్లకు ఆమోదం.
► నెల్లూరులో రెండు ఎకరాల స్థలంలో ఉన్న టీటీడీ కల్యాణమండపం ఆధునీకరణ, శీతలీకరణ, చిన్న ఆలయ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం.
► టీటీడీలోని క్లాస్–4 ఉద్యోగులకు నగదు బదులుగా యూనిఫాం క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు మంజూరు చేస్తున్నాం.
► ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి గదులు, హాస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు నిర్ణయించాం.
టీటీడీ ఆస్తులపై ఏటా శ్వేతపత్రం
Published Sun, Sep 25 2022 4:10 AM | Last Updated on Sun, Sep 25 2022 7:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment