విలేకరులతో మాట్లాడుతున్న పి.రామసుబ్బారెడ్డి
కడప సిటీ : టీడీపీ నాయకులు కొంతమంది స్వతంత్య్ర అభ్యర్థితో నామినేషన్ వేయించి నవ్వుల పాలయ్యారని స్థానిక సంస్థల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీపై పోటీ చేయాలని, స్వతంత్య్ర అభ్యర్థితో నామినేషన్ దాఖలు చేయించి అమాయక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపోయిందని తెలిపారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా నామినేషన్ వేయించి నవ్వుల పాలయ్యారన్నారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి దొంగ సంతకాలు పెట్టించారని, ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ విలువలతో కూడిన టీడీపీని స్థాపిస్తే, చంద్రబాబు పార్టీని భ్రష్టు పట్టించారన్నారు.
గతంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని వదిలాక ఆ మాజీమంత్రి నామరూపాల్లేకుండా పోయారని విమర్శించారు. ధైర్యంగా నామినేషన్ వేసే పరిస్థితి టీడీపీకి లేదని, దొంగ సంతకాలతో రూఢీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన తండ్రి వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వ్యతిరేకించి పది సంవత్సరాలపాటు ప్రజల మధ్యనే గడిపారన్నారు. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు సాధించుకుని రికార్డు సృష్టించారని అన్నారు. అన్ని రంగాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే భారీ మెజార్టీ వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని లోకేష్ ప్యాలెస్ పిల్లి అని పదేపదే మాట్లాడే అర్హత లేదని తెలిపారు. పాదయాత్రకు జనం లేకపోవడంతో డీలా పడి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని అన్నారు. పులిపులిగా, పిల్లి పిల్లిగానే ఉంటుందని గుర్తించుకోవాలన్నారు. తమకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment