మదనపల్లె : తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపంపకాల్లో చెల్లెలి కుటుంబానికి, తనకు ఉన్న వివాదంలో భాగంగా పథకం ప్రకారం బావను, చెల్లెలును హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమైన బావమరిదిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లెలో నివాసం ఉంటున్న జంగాల రామకృష్ణ(55) భార్య శివకుమారికి, పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంకు చెందిన అన్న బండారుశంకరప్పతో ఆస్తి వివాదం ఉంది.
శివకుమారికి తల్లిదండ్రుల నుంచి ఆస్తి పంపకాల్లో భాగంగా విలువైన 15 సెంట్ల స్థలం వాటాగా దక్కింది. ఈ స్థలంలో కొంత విక్రయించగా, మిగిలిన స్థలానికి సంబంధించి అన్నాచెల్లెళ్ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఆస్తికి సంబంధించి సరిహద్దుల విషయంలో అన్న శంకరప్పపై చెల్లెలు శివకుమారి.. ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని ఇతరులకు విక్రయించినట్లుగా పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. కేసులో భాగంగా బండారు శంకరప్ప అరెస్ట్ అయ్యాడు. తర్వాత విడుదలయ్యాడు.
నమ్మించి..
కొంత కాలం తర్వాత ఎలాగైనా బావ రామకృష్ణ, చెల్లెలు శివకుమారిని అంతం చేసి ఆస్తిని దక్కించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. అందులో భాగంగా చెల్లెలు కుటుంబంతో మంచి మాటలు కలిపి రాకపోకలు సాగించాడు. బుధవారం పథకం ప్రకారం కత్తిని వెంటతీసుకెళ్లి ఇంట్లోనే ఇద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా పుంగనూరు నుంచి చెల్లెలి ఇంటికి వచ్చాడు. అక్కడ మరికొందరు ఇంట్లో ఉండటంతో పథకం అమలు చేయడం అసాధ్యమని భావించాడు. బావ రామకృష్ణను పుంగనూరుకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులో వదలాల్సిందిగా కోరాడు.
దీంతో రామకృష్ణ తన స్కూటీపై శంకరప్పను వెనుక కూర్చోబెట్టుకుని ఆర్టీసీ బస్టాండు వద్దకు వచ్చాడు. ఇన్‌గేట్ సమీపంలోకి రాగానే కరెంటు పోవడంతో వెంటనే శంకరప్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో రామకృష్ణ గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో బాధితుడ్ని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కేసులో నిందితుడైన శంకరప్ప గురువారం మదనపల్లె పట్టణంలోని ఎస్టేట్ బస్టాప్ వద్ద ఉండగా, టూటౌన్ ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశాడు. నిందితుని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపుమరకల షర్టు, రూ.150 నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని రిమాండ్ కోసం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో గొడవలు, హత్యలకు, హత్యాయత్నాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బండారు శంకరప్పపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment