మదనపల్లె : ‘టీడీపీ కార్యాలయంలో జై జగన్ నినాదాలు’ శీర్షికతో ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం టీడీపీ క్యాడర్‌లో ప్రకంపనలు సృష్టించింది. అందరూ ఈ విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్ వర్గం నాయకులు..ఇది ఏడాదిక్రితం వీడియో అని, రాజకీయంగా తమ నాయకుడి ప్రతిష్టను దిగజార్చేందుకే తమ పార్టీలోని ప్రత్యర్థులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఆరోపిస్తుంటే.. వైరి వర్గం నాయకులు మాత్రం సాక్షాత్తు ఇన్‌చార్జ్ దొమ్మలపాటి రమేష్ ప్రధాన అనుచరులు ఆయన కార్యాలయంలోనే పార్టీ అధినేత చంద్రబాబును బూతులు తిట్టడమేంటని....అదీకాక ఉదయం లేచినప్పటి నుంచీ సాయంత్రం వరకు సీఎం జగన్‌ను విమర్శించాల్సిన చోట.. జై జగన్ అంటూ నినాదాలు చేయడమేంటని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
సాక్షి పత్రిక, టీవీతో పాటు సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబును బూతులు తిట్టిన వీడియో వైరల్ కావడంతో సోమవారం టీడీపీ నాయకులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. రాజంపేట క్రిస్టియన్ సెల్ పార్లమెంటరీ అధ్యక్షుడు దేవా రమేష్ వైరల్ అయిన వీడియోపై స్పందిస్తూ...టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్ కార్యాలయంలో శ్రీరామ విద్యాసాగర్, రాటకొండ మధుబాబు, తాను ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో వీడియోను రికార్డ్ చేసింది తానేనని చెప్పుకొచ్చారు.
టీడీపీ నాయకుడు శ్రీరామవిద్యాసాగర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా రికార్డ్ చేసుకోరా అంటూ చెప్పడంతోనే తీసినట్లు వివరణ ఇచ్చారు. చిత్తూరుజిల్లాలోని కాణిపాకవినాయకస్వామి, తాను నమ్మే ఏసుప్రభువు సాక్షిగా తాను చెప్పేది అక్షరసత్యమన్నారు. శ్రీరామవిద్యాసాగర్‌ను రాటకొండ మధుబాబు రెచ్చగొట్టాడన్నారు. అంగళ్లులో కిషోర్, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌పై జరిగిన దాడిపై మాట్లాడుతుండగా, యాలగిరి దొరస్వామినాయుడు, చినబాబులకు కారు అద్దాలు పగిలాయని హైకమాండ్ పదవులిచ్చిందని.. మరి నాకు తలకాయ పగిలింది, నాకు ఏమి ఇవ్వాలని రెచ్చగొట్టడంతో, అప్పటికే కొద్దిగా మద్యం మత్తులో ఉన్న విద్యాసాగర్ మాటలు తూలాడాన్నారు. దీనికి, టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు.
ఆరోజు తాను తీసిన వీడియో ఒక మధుబాబుకు తప్ప వేరెవ్వరికీ ఇవ్వలేదని, అప్పుడే డిలీట్ చేశానని, అధిష్టానం వరకు వీడియో వెళ్లిందని, అందరు పెద్దలు చూశారని చెప్పారు. విద్యాసాగర్‌కు పదవి రాలేదన్నారు. పార్టీకి ఎవరు ఏమి చేసినా ద్రోహమేనని, పెద్దాయన మీద ఎవరు మాట్లాడినా తప్పే..ఎవరైనా సరే.. ఆరోజు వీడియో వైరల్ చేశారు. సరిపోయింది. మళ్లీ నేడు వీడియో వైరల్ అయిందంటే.. రాటకొండ మధుబాబుకు మదనపల్లె ఎమ్మెల్యే టికెట్ అవసరం వచ్చింది కనుకే బయటకు వచ్చిందన్నారు.
మధుబాబు రామసముద్రం కాంగ్రెస్ మీటింగ్‌లో తమ నాయకుడు చంద్రబాబునాయుడును అనరాని మాటలు అన్నాడని, చిత్తూరుబస్టాండ్‌లో దిష్టిబొమ్మలు తగులబెట్టాడన్నారు. కౌన్సిలర్ కాలేని వ్యక్తి తన స్వార్థం కోసం నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడన్నారు. పసుపుచొక్కాలు వేసుకున్న వారందరూ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు కాలేరని, తన స్వార్థం కోసం వీడియో వైరల్ చేశాడన్నారు. అధిష్టానానికి తన విన్నపమేంటంటే.. ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఒకవేళ తాను వీడియో తీసినది తప్పనిపిస్తే తనను సస్పెండ్ చేసినా అభ్యంతరం లేదని, ఈ ఒక్కసారికి తప్పుచేసిన వ్యక్తులపై విచారణ కమిటీ వేసి,వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా వేడుకుంటున్నానన్నారు.
ఈ విషయమై రాటకొండమధుబాబు వివరణ ఇస్తూ..ఆరోజు ఘటనకు వీడియో సజీవ సాక్ష్యంగా ఉన్నందున తాను చెప్పాల్సిందేమీ లేదన్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే టీడీపీలో నాయకుల మధ్య మొదలైన వర్గవిభేదాలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 4న మాజీ సీఎం చంద్రబాబు మదనపల్లె పర్యటన ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్నే బూతులు తిడుతూ స్థానిక నాయకులు చేసిన వీడియో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment