
కురబలకోట : సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో నటించాలన్న మోజుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. హైదరాబాదులో ఉన్న అతన్ని ముదివేడు ఎస్‌ఐ ముబీన్ తాజ్ రప్పించి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు...కురబలకోట మండలం తెట్టు గ్రామం శ్రీరాములవారిపల్లెకు చెందిన వి. రవికుమార్ అంగళ్లు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఇతను ఇంటి వద్ద టీవీలో సినిమాలు చూడటం ఆపై టీవీలో వచ్చే జబర్దస్త్, ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితుడయ్యాడు.
తాను కూడా వారిలాగే నటించాలని కలలుగన్నాడు. దీంతో ఈనెల 9న స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబీకులు ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి నుండి అదృశ్యమైన ఇతను కాండ్లమడుగు ద్వారా బి.కొత్తకోటకు వెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి మైసూర్ చేరుకున్నాడు. ఓ వాహనదారుడి సహకారంతో హైదరాబాదు చార్మినార్ వద్దకు చేరుకున్నాడు.
అక్కడ అదే సమయానికి సినీ షూటింగ్ జరుగుతుండడంతో యూనిట్‌లోని కుర్రాళ్లతో మాట కలిపి వారి వద్ద వర్కర్‌గా చేరాడు. తాను సినిమాల్లో నటించడానికి హైదరాబాదు వచ్చానని రెండు రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని బుధవారం హైదరాబాదు నుండి రప్పించారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఎస్‌ఐ ముబీన్ తాజ్ అతన్ని కుటుంబీకులకు అప్పగించారు.కాగా ఇంటి నుంచి బాలుడు వెళ్లే సమయంలో అతని చేతిలో చిల్లిగవ్వ కూడాలేదు. కేవలం దారిన వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడుగుతూ అతను ఊర్లన్నీ చుట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.