కర్నూలు (ఓల్డ్‌సిటీ): తల్లిదండ్రులు చేయలేని పనిని ఆ సంస్థ చేసిచూపిస్తోంది.. పిల్లల పోషణ, పెంపకం, విద్యా బుద్ధులు నేర్పడం వరకే సాధ్యమవుతుందేమో కానీ వారు తమ పిల్లలను ఉద్యోగాలకు ఎంపికయ్యేంత నేర్పరితనాన్ని మాత్రం నూరిపోయలేరు. అలాంటి కఠినమైన పాత్రను ఆ సంస్థ పోషిస్తోంది. అంతే కాదు.. ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇప్పిస్తోంది. ఇంతకూ ఆ సంస్థ పేరు ఏమిటని అనుకుంటున్నారా.. సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ ఇన్నోవేషన్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్). జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
గ్రామీణ నిరుద్యోగుల భవిష్యత్తుకు బాటలు..
పల్లె ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకుల భవితకు బాటలు వేయాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ–జీకేవై) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరి డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సీడాప్ సంస్థను స్వయంగా నడిపిస్తోంది. రాష్ట్రంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. 2008లో కర్నూలులో స్థాపించారు. ఆతర్వాత ఎమ్మిగనూరులోనూ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం జిల్లాలో ఈ రెండు చోట్లా శిక్షణలు కొనసాగుతున్నాయి. బ్యాచీకి 35 మంది చొప్పున కర్నూలులో రెండు బ్యాచీలు, ఎమ్మిగనూరులో ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలపరిమితి 90 రోజులు. కుములేటివ్ ఇంగ్లీష్, రిటైల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, టైపింగ్ వంటి నేర్పిస్తారు. ఇక్కడి ఫ్యాకల్టీ ఇతరుల పట్ల గౌరవ భావం, సౌమ్యంగా మాట్లాడే విధానం నేర్పడంతో పాటు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.
ఇంటికంటే మెరుగైన సదుపాయాలు..
ఆ సంస్థలో చేరిన యువతీ యువకులకు మూడు పూటలా చక్కటి భోజనంతో పాటు సాయంత్రం పూట స్నాక్స్ కూడా అందిస్తారు. ఆహారం తయారీదారులు పౌష్ఠిక విలువలు, రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఆహార వడ్డింపును సీడాప్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వారు సూచించిన మెనూ ప్రకారమే ఆహారాన్ని అందిస్తారు.
శిక్షణలో చేరగానే మొదట రెండు జతల యూనిఫాంతో పాటు ఒక జత షూస్, సాక్స్‌లు ఇస్తారు. తరగతిలో హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉంటుంది. బస చేసేందుకు యువతులకు, యువకులకు వేర్వేరు గదులను ఏర్పాటు చేశారు. నిద్రించేందుకు నాణ్యమైన పరుపులు కూడా ఉంటాయి. సంస్థ జేడీఎం కిరణ్ సంస్థను నిత్యం పర్యవేక్షిస్తుంటారు.
శిలను శిల్పం చేసిన సీడాప్..
చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు సువర్చల. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామ రైతు ఎర్రపోగు మోహన్ కూతురు. ఇంటర్ వరకు చదువుకుంది. వీరిది నిరుపేద కుటుంబం. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. ఇలాంటి తరుణంలో జాబ్ రీసోర్స్ పర్సన్ ద్వారా సీడాప్ సంస్థ గురించి తెలుసుకుంది. 2020 జనవరిలో సీడాప్ సంస్థలో చేరి 90 రోజుల శిక్షణ చేసింది. శిలను శిల్పంగా మార్చే చందంగా ఈ సంస్థలో ఫ్యాకల్టీ చక్కటి తర్ఫీదు ఇచ్చారు.
క్యుములేటివ్ ఇంగ్లీష్, రిటైల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, టైపింగ్ వంటి నేర్పించారు. ఇతరులను ఎలా గౌరవించాలి, సౌమ్యంగా మాట్లాడే విధానాన్నీ నేర్పారు. ట్రైనింగ్ పూర్తి కాగానే ఆమెను హైదరాబాదులోని లలిత జువెల్లర్స్ షోరూమ్ వారు సేల్స్ రంగంలో ఉద్యోగం ఇచ్చారు. మొదట జీతం 12,500 రూపాయలు ఉండేది. సంవత్సర కాలంలోనే ప్రతిభ చూపించి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొందింది. ప్రస్తుతం ఆమె జీతం (ఇన్సెంటివ్‌లతో కల్పుకుని) నెలకు రూ. 35 వేలు పైమాటే. కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిపిన సీడాప్ సంస్థ రుణం తీర్చుకోలేనిదని ఆమె పేర్కొంటున్నారు.
ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతోంది
ఈమె పేరు శాంతమ్మ. పాములపాడు మండలం వానాల గ్రామ రైతు కుటుంబానికి చెందిన ఈ యువతి ఐదేళ్ల క్రితమే ఇంటర్ పూర్తి చేసింది. వ్యవసాయ రంగంలో ఒడిదుడుకుల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. తాను ఉన్నత చదువులు చదువుకోలేదు, తనకు ఎవరు ఉద్యోగమిస్తారంటూ తరచూ ఆందోళనకు గురయ్యేది. ఆనోటా ఈనోటా సీడాప్ సంస్థ గురించి తెలుసుకుంది. అప్పట్లో 75 రోజుల శిక్షణ ఉండేది. సంస్థలో చేరి శిక్షణ పూర్తి చేసుకుంది.
హైదరాబాదులోని డీమార్ట్ స్టోర్స్‌లో సీఎస్‌ఏగా ఉద్యోగం పొందింది. చేరినప్పుడు జీతం కేవలం రూ. 8,000 ఉండేది. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణ, ఖచ్చితత్వం, అంకితభావం వంటి గుణాలను చూసి యాజమాన్యం ఆమెకు పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు నగరంలోని డీమార్ట్ షోరూమ్‌లో ఫ్లోర్ ఇంచార్జి. ఈమె జీతం అక్షరాలా రూ. 38 వేలు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే కాక ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను కూడా నెరవేర్చుకుంటానని చెబుతోంది.
తొలగుతున్న నిరుద్యోగ సమస్య: బి.కె.వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్‌డీఏ
కొత్త ప్రభుత్వం వచ్చాక వలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ప్రజా పంపిణీ సరుకుల వాహనాలు వంటి వాటి ద్వారా దాదాపుగా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు అయ్యారు. కాగా సీడాప్ ద్వారా కొనసాగుతున్న ఉద్యోగ కల్పన ప్రక్రియ ద్వారా ఏడాదికి 420 మంది వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులుగా మారుతున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా నిరుద్యోగులు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అయ్యారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment