
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
అమ్మా.. నాన్నా.. పిలుపుతో పరవశం
పుట్టుకతో బధిరులైన నా ఇద్దరు పిల్లలకు మాట నేర్పి పునర్జన్మ ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఇది. నా బిడ్డలకు రూ.14 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లు ఉచితంగా చేశారు. మాది బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఊటగుంట సావరం గ్రామం. మాది మేనరికం వివాహం. మాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ మూగ, చెవుడు సమస్యతో పుట్టారు.
నేను కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. పిల్లలకు మాటలు రాక ఎంతో ఆందోళన పడేవాళ్లం. పిల్లలకు వైద్యం చేయించాలని ఎన్నో ఆస్పత్రులకు తిరిగినా ఫలితం కనిపించలేదు. పిల్లల శస్త్ర చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని మేము అంత ఖర్చు ఎక్కడ చేయగలం? 2021 డిసెంబర్‌లో విశాఖలోని ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళ్లాం.
నా కుమారుడు మోహన్‌కృష్ణను అక్కడి వైద్యులకు చూపించాను. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. ఫలితంగా నా కుమారుడు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు. ఏడు లక్షల రూపాయలు ఖరీదు చేసే చికిత్సను ఈ ప్రభుత్వం ఉచితంగా చేసి నా కుమారుడికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు స్కూలుకు కూడా వెళ్తున్నాడు. అమ్మా.. నాన్నా.. అని నోరారా పిలుస్తుంటే పరవశించి పోతున్నాం.
ఇటీవల నా కుమార్తె కడలి దివ్య వెంకట సత్యకు (మూడున్నర సంవత్సరాలు) కూడా విశాఖ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స చేయించాం. త్వరలో డిశ్చార్జి చేస్తామని చెప్పారు. పిల్లలతో అమ్మా–నాన్న అని పిలిపించుకోలేమేమో అని ఎంతో ఆందోళనకు గురయ్యాం. ఇక ఆ బెంగలేదు. మా పిల్లలకు మాట నేర్పిన దేవుడు జగనన్న. – కడలి మనోహర్, ఊటగుంట సావరం (వెలవలపల్లి శ్రీనివాసరావు, విలేకరి, మహారాణిపేట విశాఖపట్నం)
అప్పుల తిప్పలు లేవిక
మా ఆయన 14 ఏళ్ల క్రితం కాలం చేశారు. నేను రోజువారీ కూలిపనికి వెళ్లేదాన్ని. వేసవి, వర్షాకాలాల్లో అనారోగ్యం సంభవించినప్పుడు రోజు గడవడం కష్టమయ్యేది. మందులు కూడా కొనుగోలు చేయలేకపోయేదాన్ని. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామంలో పురాతన సొంతిల్లు ఉండేది. దానివల్ల అద్దె భారం లేకపోయినా జీవనానికి ఇబ్బంది పడేవాళ్లం.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు అబ్బాయిలు ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లినా, వారి బతుకు వారు బతుకడానికే అక్కడి ఆదాయం సరిపోతుండేది. నేను ఇందిరమ్మ పొదుపు సంఘంలో సభ్యురాలిని. బతుకుదెరువు కోసం టైలరింగ్‌లో శిక్షణ పొంది ఉండడంతో కుట్టుపని ప్రారంభించాను. స్నేహితులు, బంధువులు సహకరించడంతో కొంత వరకూ బతుకీడ్చాను.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గతంలో నేను తీసుకున్న రుణం మాఫీ చేయడంతో వైఎస్సార్ ఆసరా కింద గత మూడేళ్లలో 24,000 రూపాయలు వచ్చింది. కాపు నేస్తం కింద ఏటా 15,000, చేదోడు కింద 10,000 రూపాయలు వచ్చాయి. దాంతో హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో చీరలు, ఇతర వస్త్రాలు తెప్పించి ఆ వ్యాపారం చేపట్టాను.
ఇప్పుడు నెలకు రూ.20 వేలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా, అప్పుల బెంగ లేకుండా సాఫీగా సాగుతోంది. – సుజాతమ్మ, ముక్కెళ్ల (గవిని శ్రీనివాసులు, విలేకరి, కర్నూలు)
ఇంజినీరింగ్ కల సాకారం
మా నాన్న రాడ్ బెండింగ్ పనులు చేస్తూ.. తద్వారా వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మా ఇద్దరి చదువు మా నాన్నకు భారంగా మారింది. ఈ ప్రభుత్వం అందించిన విద్యా దీవెన పథకంతో మా సొంత ఊరైన తిరుపతి జిల్లా నాయుడు పేటలో ఇంటర్ పూర్తి చేశాను. ఇంజినీరింగ్ చేయాలని నా ఆకాంక్ష.
మా తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివించలేరనుకుని అలోచనలో పడ్డా. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి పేద విద్యార్థులకు తోడ్పాటును అందించేందుకు తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పడంతో విద్యానగర్‌లోని ఎన్బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ పూర్తి చేశా. తొలి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.73,000 అందించారు.
మరో రెండు నెలల్లో రెండో ఏడాదికి సంబంధించిన నగదు జమ కానుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఈ రోజు ఉన్నత చదువు కొనసాగిస్తున్నా. నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం పరిస్థితి మారిపోతుందని నమ్ముతున్నా. ఇదంగా సీఎం జగన్ చలువేనని చెప్పేందుకు ఎంతో సంతోషపడుతున్నా. – మొండెం అజయ్, నాయుడుపేట (ఎస్.ముత్యాలయ్య, విలేకరి, నాయుడుపేట)