
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సర్కారు సాయంతో సాఫీగా జీవనం
నేను రజక వృత్తి చేసుకుంటూ భార్య, పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాకు భార్య భవాని, కుమారుడు నాగవెంకటేష్, కుమార్తె త్రివేణిదుర్గ ఉన్నారు. మాది కాకినాడ జిల్లా కరప మండలం యండమూరు. గతంలో కొన్ని కుటుంబాల వారి దుస్తులు ఉతుకుతూ తద్వారా వచ్చిన ఆదాయంతోనే జీవనం సాగించేవాళ్లం. కాలంతోపాటు వచ్చిన మార్పులతో ఉన్నత, మధ్య తరహా కుటుంబాల వారు వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేసి, వారి దుస్తులు వారే ఉతుక్కుని, ఇస్త్రీ కూడా చేసుకుంటున్నారు.
దీంతో రజకులకు పని తగ్గిపోవడంతో ఆదాయం పూర్తిగా సన్నగిల్లింది. ఫలితంగా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. మా ఇబ్బందులను గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక నవరత్న పథకాలు తీసుకొచ్చి మాలాంటి పేద వర్గాల కుటుంబాలలో వెలుగులు నింపారు. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా రూ. 10 వేలు వంతున నాలుగు విడతలుగా రూ. 40 వేలు లబ్ధి చేకూరింది. ఈ సొమ్ము లాండ్రీ షాపు నిర్వహణకు అవసరమయ్యే బొగ్గులు, ఇస్త్రీ పెట్టె, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి ఉపయోగపడుతోంది.
నా దగ్గరకు వచ్చిన దుస్తులు గతంలో భద్రపరుచుకోవాలంటే ఎలుకల భయం ఉండేది. ఇప్పుడు ఆ దుస్తుల కోసం అలమారా లాంటిది సమకూర్చుకున్నాను. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇందులో మా పెద్దబ్బాయికి అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఇప్పటి వరకూ రూ.60 వేలు అందుకున్నాం. వీటితోపాటు పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో చదువు సమస్య తీరింది. కరప సెంట్రల్ లే అవుట్‌లో జగనన్న కాలనీలో రూ.6 లక్షల విలువైన ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరిపోయాయి. – శీలం వీరవెంకట సత్యనారాయణ, యండమూరు (చోడిశెట్టి సత్యనారాయణ, విలేకరి, కరప)
వ్యాపారం గాడిన పడింది
ఒకప్పుడు కూలి పనుల కోసం పొట్ట చేత పట్టుకుని నెల్లూరు జిల్లా అంతటా తిరిగేవాళ్లం. రెండెకరాల పొలం ఉన్నా, వర్షం వస్తే తప్ప పంటలు పండేవి కావు. దీనివల్ల కూలి పనులపైనే ఆధారపడి బతికేవాళ్లం. మా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నా భర్త శ్రీనివాసులు, ఇద్దరు కుమారులతో నెల్లూరు జిల్లా చేజర్లలో నివసించేవాళ్లం.
ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబ స్వరూపాన్ని మార్చింది. ఎన్నికల నాటికి బ్యాంకులకు బకాయిపడిన రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేస్తామన్న హామీ మేరకు మేము బ్యాంకుకు చెల్లించిన మొత్తంలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.36 వేలు నా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మొదటి విడత వచ్చిన మొత్తంతో చేజర్లలో చిన్నగా ఫ్యాన్సీ షాపు పెట్టాను. మొదట్లో అంతంత మాత్రంగానే అమ్మకాలు అయ్యేవి. తర్వాత రెండు విడతల్లో జమ అయిన మొత్తంతో మరిన్ని సరుకులు తెచ్చి విక్రయించడం ప్రారంభించాం.
చుట్టుపక్కల అందరూ మా దగ్గరే వస్తువులు కొనేలా వారిని ప్రోత్సహించాం. ప్రస్తుతం వ్యాపారం బాగుంది. వైఎస్సార్ తోడు పథకం ద్వారా మరో రూ.10 వేలు మంజూరైంది. వాటితో మహిళలకు కావాల్సిన దుస్తులు అందుబాటులో ఉంచడంతో వ్యాపారం మెరుగైంది. ఇప్పుడు వ్యవసాయం కంటే దుకాణం ద్వారానే ఆదాయం బాగుంది. గతంలో మా పిల్లలను చదివించుకొనేందుకు అష్ట కష్టాలు పడేవాళ్లం. ఇప్పుడు అమ్మ ఒడి పథకం ఆ కష్టాలు తీర్చింది. – శ్రీలత, నెల్లూరు జిల్లా (తోట రవీంద్రబాబు, విలేకరి, చేజర్ల మండలం)
పెట్టుబడి భారం తగ్గింది
గతంలో వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. వచ్చిన ఆదాయం వడ్డీలకే సరిపోయేది. దాంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. ఇప్పుడు అప్పుల బాధ తప్పింది. మా స్వగ్రామం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాయపుర అగ్రహారంలో మాకు 1.80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
ఎకరా భూమిలో సీజనల్‌గా వరి, మిగిలిన భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాం. మొత్తం మేము ఏడుగురు కుటుంబ సభ్యులం. వ్యవసాయంతో పాటు పశుపోషణ, మేకల పెంపకం కూడా చేపట్టాం. నా భార్య పార్వతితో పాటు అమ్మనాన్నలు సహాయం చేస్తుంటారు. ఈ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులు రాయితీపై అందిస్తూ రైతులను ప్రోత్సహించడంతో మాకు పెట్టుబడి భారం బాగా తగ్గింది. నాకు ముగ్గురు పిల్లలు కాగా, బాబు జగదీష్ (16) కొంత వైకల్యంతో బాధ పడుతున్నాడు. అతనికి నాలుగేళ్లుగా దివ్యాంగ పింఛన్ నెలకు రూ.3 వేలు వస్తోంది. మా నాన్న పేర్నినాయుడుకు ఈ ప్రభుత్వం వచ్చాకే వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా ఇద్దరు అమ్మాయిలు గుణశ్రీ, విజయ సబ్బవరం కేజీబీవీలో 10, 9వ తరగతి చదువుతున్నారు. అమ్మఒడి డబ్బులు ఏటా అందుతున్నాయి. ఇలా మా కుటుంబానికి ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో భరోసా ఇచ్చింది. – పిల్లల స్వామినాయుడు, రాయపుర అగ్రహారం (సుర్ల నాగేశ్వరావు, విలేకరి, సబ్బవరం)