ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
వ్యవసాయం పండగైంది
నేను మా గ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట పండిస్తున్నా. మాకు సొంతంగా 80 సెంట్ల భూమి ఉంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వ్యవసాయం భారమైపోయింది. ఒక దశలో వదిలేద్దామనుకున్నాను. అంతలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో రైతుల దశ మారింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతును నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని సమయాల్లో అండగా నిలుస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే అని గర్వంగా చెప్పుకోవచ్చు. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామం.
ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా రూ.63,500, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.1,509, వైఎస్సార్ పంటల బీమా ద్వారా రూ.2,74,592, పంట నష్ట పరిహారం ద్వారా రూ.57,750 ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది. ఇంతగా సాయం పొందిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. మా కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతోంది. – దునే వీర్రాఘవులు, వెల్ల (నరాల రాధాకృష్ణ, విలేకరి, రామచంద్రాపురం రూరల్)
చదువుకు దిగుల్లేదిక
మా నాన్న హనుమంతు విజ్ఞేశ్వరరావు షాపులో గుమస్తా. అమ్మ గృహిణి. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. నేను, మా అన్నయ్య ప్రభుత్వం అందిస్తున్న సహాయంతోనే విద్యనభ్యసించగలుగుతున్నాం. నేను పదో తరగతిలో ఉండగా అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందాను. తర్వాత ఇంటర్మీడియట్ రెండేళ్లూ అమ్మ ఒడి తీసుకున్నా.
ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఇఇఇ) మొదటి సంవత్సరం చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్) కారణంగానే ఇది సాధ్యమైంది. మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను చదువుతున్న ఇంజనీరింగ్ కళాశాలలో ఏటా దాదాపు రూ.70 వేలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా మాపై భారం పడటం లేదు.
ఈ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలో విద్యా రంగం స్వరూపమే మారిపోయింది. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు భరోసా లభిస్తోంది. స్కూల్ లెవెల్‌లో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మా లాంటి విద్యార్థుల చదువుకు దిగ్గుల్లేదు. – హనుమంతు హరి, భీమవరం (వీఎస్ సాయిబాబా, విలేకరి, భీమవరం)
నెరవేరిన దశాబ్దాల కల
మూడు దశాబ్ధాల నుంచి ఏ ప్రభుత్వం మాకు ఇంటి స్థలం ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెంలోని రోడ్డు మార్జిన్‌లో 30 ఏళ్లుగా పూరి గుడిసెలో ఉండేవాళ్లం. రోజు వారీగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఇంటి స్థలం ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. మా గోడు ఎవరూ పట్టించుకోలేదు.
గత టీడీపీ ప్రభుత్వంలో మా పేదోళ్ల గుడిసెలు పీకడానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను అడ్డుకుని ప్రతిఘటించాం. అప్పట్లో గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు మాకు అండగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
ఆ హామీ ప్రకారం ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ మా ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కొద్ది రోజుల్లోనే మాకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చింది. నాకు పింఛన్ రూ.3000 వస్తోంది. పెరిగిన పింఛన్‌తో ఎంతో ఊరట లభిస్తోంది. – తమ్మినపూడి రత్నం, సంగాయగూడెం (కాసాని వెంకటేశ్వర్లు, విలేకరి, దేవరపల్లి)
Comments
Please login to add a commentAdd a comment