ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా బతుకులకు భరోసా
బతుకు తెరువు కోసం వలస వచ్చిన జీవితాలు మావి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం శ్యామాదల గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకుని 2015లో కడపకు వచ్చాం. మా ఆయన వేణుగోపాల్‌రెడ్డి కడప నగరంలో ఆటో నడుపుతారు. నేను కుట్టు మెషీన్‌పై దర్జీ పని చేస్తాను. మాకు రమాశ్రీ రెడ్డి, లక్ష్మీశ్రీ రెడ్డి అనే ఇద్దరు కవల పిల్లలు. 8వ తరగతి చదువుతున్నారు. మా అరకొర సంపాదనతోనే ఇంటి అద్దె చెల్లిస్తూ, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ అతి కష్టంగా బతుకు వెళ్లదీస్తున్నాం.
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా బతుకులకు భరోసా కలిగింది. కడప నగర శివారు ఆచార్య కాలనీ వద్దనున్న జగనన్న కాలనీలో సెంటున్నర స్థలాన్నిచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేశారు. ప్రస్తుతం శ్లాబ్ వేశాం. దీనికి సంబంధించి బిల్లులు కూడా చెల్లించారు. వీలైనంత వేగంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. మాలాంటి మధ్య తరగతి వారు అరకొర సంపాదనతో సొంతింటి కల నెరవేర్చుకోవడం జీవితంలో జరిగే పని కాదు.
జగనన్న పుణ్యమా అని మా సొంతింటి కల నేరవేరబోతోంది. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి రమాశ్రీ రెడ్డికి ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణ మాఫీ ద్వారా నాకు రూ.4,200 లబ్ధి చేకూరింది. జగనన్న చేదోడులో ఏటా రూ.10 వేలు చొప్పున మూడేళ్లలో రూ.30 వేలు నా బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఆరోగ్యశ్రీలో నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ జరిగింది. ఇందుకు ప్రభుత్వం రూ.30 వేలు ఆస్పత్రికి చెల్లించింది. వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో నా భర్తకు నాలుగేళ్లలో రూ.40 వేలు లబ్ధి చేకూరింది. మేం ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఈ ప్రభుత్వమే కారణం. – చిలకల లక్ష్మీప్రసన్న, కడప (గోసల యల్లారెడ్డి, విలేకరి, కడప)
పక్క ఊరిలోనే ఉద్యోగావకాశం
మాది సామాన్య వ్యవసాయ కుటుంబం. ఎంతో కష్టపడి మా నాన్న నన్ను బీఎస్సీ నర్సింగ్ చదివించారు. ఆ చదువు పూర్తయ్యాక ఎప్పుడు ఉద్యోగం వస్తుందో.. ఎంత దూరంలో వస్తుందోనని ఆందోళన చెందాను. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన ‘వైఎస్సార్ విలేజ్ క్లీనిక్’ వ్యవస్థ వల్ల శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నరసింగపల్లి పక్కనున్న గూడేం గ్రామంలో ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) ఉద్యోగం వచ్చింది.
2022 ఫిబ్రవరిలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. మే నెలలో ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు జిల్లాలు దాటి ఉద్యోగావకాశాల కోసం వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వ్యవస్థతో మా గ్రామం పక్కనే ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా జీతం మా కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చగలుగుతోంది. ఇలాంటి వ్యవస్థ వల్ల నాలాంటి ఎంతో మంది యువతకు సొంత మండలంలోనే ఉద్యోగాలు వస్తున్నాయి. – సింగుపురం ఈశ్వరి, గూడేం (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి)
‘మెట్ట’నింట జలకళ
మాది వ్యవసాయ కుటుంబం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జలపవారిగూడెంలో మాకున్న సుమారు మూడు ఎకరాల భూమిలో మా బంధువైన నక్క డేవిడ్, నేను కలిసి వైఎస్సార్ జలకళ పథకం ద్వారా ఉచితంగా బోరు వేయించుకున్నాం. ఇప్పుడు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నాం. కొంత మంది టీడీపీ నాయకులు ప్రభుత్వం అందించిన 10 హెచ్‌పీ మోటార్ మెట్ట ప్రాంతానికి ఎలా సరిపోతుందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రైతులను మోసం చేయడానికి ఈ పథకం పెట్టిందని, ఇది దండగని ఎగతాళి చేసి మాట్లాడారు.
కానీ ఇప్పుడు మోటార్ నుంచి మూడు అంగుళాల నీళ్లు పోస్తుంటే, నవ్వినోళ్లే అవాక్కవుతున్నారు. మా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. మా కష్టాలు తీరాయి. దీంతోపాటు నాకు రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.13,500 అందడంతోపాటు, నా భార్యకు డ్వాక్రా ద్వారా సున్నా వడ్డీ లబ్ధి చేకూరింది. గత టీడీపీ ప్రభుత్వంలో మాకు ఎటువంటి సహాయం అందలేదు. మా కుటుంబానికి మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – నక్కా దుర్గయ్య, జలపవారిగూడెం (యు.లక్ష్మీనారాయణ, విలేకరి, కామవరపుకోట)
Comments
Please login to add a commentAdd a comment