
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా పిల్లల ప్రాణాలు జగనన్నచలువే
మాది నిరుపేద కుటుంబం. మా ఆయన వసంతరావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో వ్యవసాయ కూలీగా ఉండేవారు. ఆయనకు నేను చేదోడుగా ఉండేదాన్ని. మా ఆయన అనుకోకుండా రెండేళ్ల క్రితం కాలం చేశారు. మాకు 12 ఏళ్ల బాబు, తొమ్మిదేళ్ల పాప ఉన్నారు. ఇద్దరూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి ప్రభావం వల్ల పిల్లల్లో రక్తం తగ్గిపోవడంతో అనారోగ్యంతో బాధ పడేవారు. గత ప్రభుత్వ హయాంలో మాకు ఏ విధంగానూ సాయం అందలేదు. రక్తం తగ్గినప్పుడు అప్పు చేసి రక్తం ఎక్కించి పిల్లలను అతి కష్టం మీద బతికించుకునేవాళ్లం.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా పిల్లలిద్దరికీ నెలకు రూ.10 వేలు వంతున ఇద్దరికీ రూ.20 వేలు పింఛన్ మంజూరు చేశారు. ఆ మొత్తంతో పిల్లలిద్దరికీ రక్తం ఎక్కిస్తున్నా. పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పెడుతున్నా. అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నా. నాకు వితంతు పింఛన్ వస్తోంది. పిల్లల సంరక్షణ చూసుకుంటుండటంవల్ల ఏ పనికీ వెళ్లలేకపోతున్నా. అయినా వచ్చిన పింఛన్ డబ్బులతో పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నా. ఈ రోజు మా పిల్లలు బతికే ఉన్నారంటే అదంతా జగనన్న చలవే. – అందవరపు భవాని, కొత్తూరు (అల్లు నరసింహారావు విలేకరి, కొత్తూరు)
కుటుంబానికి చేదోడుగా..
మాది మధ్య తరగతి కుటుంబం. విశాఖపట్నంలోని అల్లిపురం వెంకటేశ్వరమెట్టలో నివాసం ఉంటున్న మేమంతా కష్టపడినా గతంలో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. టైలరింగ్ ప్రారంభించాను. ఈ మేరకు చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకోగానే మంజూరైంది. రెండు సంవత్సరాలుగా ఈ పథకం కింద ఏటా రూ.10 వేల వంతున ఇప్పటికి రూ.20 వేలు వచ్చింది.
ఈ మొత్తంతో కుట్టుమెషిన్ కొనుక్కొని టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నా. మా ఆయన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మా అబ్బాయి ఒకటో తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా మామగారికి 60 ఏళ్లు దాటడంతో వైఎస్సార్ ఆసరా ఫించన్ వస్తోంది. ఈ ప్రభుత్వం అందించిన సాయంతో ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాం. – మునశాల కనక, అల్లిపురం, విశాఖపట్నం (మద్దాల వెంకటసూరి అప్పారావు, విలేకరి, అల్లిపురం)
దేవుడిలా ఆదుకున్నారు
మా ఆయన రెడ్డి ప్రసాద్ రైతు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మాకు ఇద్దరు పిల్లలు. బాబు కేతన్, పాప షన్విత. కేతన్‌కు ఆరేళ్ల వయస్సులో స్కూల్లో ఉన్నపుడు గుండె నొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించాం. వైద్యులు ప్లేట్‌లెట్స్ తగ్గాయని వైద్య పరీక్షల ద్వారా గుర్తించి పెద్దాస్పత్రిలో చేర్చాలని చెప్పారు. దీంతో బెంగళూరులోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రికి వెళితే బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. చికిత్సకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. బిడ్డను ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న పొలాలు, నగలు అమ్మి వైద్యానికి ఖర్చు చేశాం.
రూ.8 లక్షలు అనుకున్నది కాస్తా రెండేళ్లలో రూ.70 లక్షల వరకు ఖర్చయింది. బిడ్డ వైద్యం కోసం డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే.. తెలిసిన వారు సీఎం సహాయనిధి గురించి చెబితే దరఖాస్తు చేసుకున్నాం. బ్లడ్ క్యాన్సర్‌తో రెండేళ్లు పోరాడి ఈ నెల 2న బాబు చనిపోయాడు. సరిగ్గా వాడు చనిపోయిన 12 రోజులకు సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. ఇప్పుడు మాకు అదే ఆధారం. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు సీఎం సహాయ నిధి ఆదుకుంది. కేతన్‌కు అమ్మ ఒడి పథకం కింద రెండు విడతల్లో రూ.30 వేలు అందింది. రెండో బిడ్డను ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. జగనన్న ప్రభుత్వం మాలాంటి ఎందరికో మేలు చేస్తోంది. మళ్లీ మేము మామూలుగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. ప్రజలందరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలో ఉండాలన్నది నా ఆకాంక్ష. – రోజారమణి, మదనపల్లె (వంశీధర్ సూరమాల, విలేకరి, మదనపల్లె)
Comments
Please login to add a commentAdd a comment