ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సర్కారు ‘చేయూత’తో సాఫీగా జీవనం
మాకున్న ఎకరం పొలంలో వరిసాగు చేసేవాళ్లం. ఐదేళ్ల క్రితం సంభవించిన వరుస తుపాన్లు.. చీడ, పీడల వల్ల పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాం. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. నేను కస్తూర్భా స్వయం శక్తి సంఘంలో ఉండటంతో మా సీఎఫ్ సలహా మేరకు బ్యాంకు ద్వారా రూ.50 వేలు తీసుకొని ఆటో కొనుక్కుని దానినే జీవనాధారంగా చేసుకున్నాం. దానివల్ల కూడా కష్టాలు తీరలేదు. ఈ లోగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడు పర్యాయాలు వచ్చింది.
వైఎస్సార్ ఆసరా కింద రూ.5 వేలు చొప్పున నాలుగు పర్యాయాలు అందింది. ఆ మొత్తంతో సాగుకు పనికి రాని ఎకరా భూమిపై పెట్టుబడి పెట్టాం. నిత్య పంటగా కాయగూరలు పండించడం ప్రారంభించాం. ఇప్పుడు కాయగూరల సాగు ఆశాజనకంగా ఉండటంతో నెలవారీ మంచి ఆదాయం వస్తోంది. మా ఆయనకు వాహనమిత్ర ద్వారా ఏటా రూ.పది వేలు వంతున అందుతోంది. మా అమ్మాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తోంది. ఇప్పుడు మా కుటుంబమంతా సంతోషంగా ఉంది. కుటుంబానికి అండగా ఉన్న సీఎం జగనన్న రుణం తీర్చుకోలేనిది. – కొల్ల లక్ష్మి, కొళిగాం (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)
ఉచితంగా ఉన్నత విద్య
మా నాన్న కరీముల్లా స్వర్ణకారుడు. అమ్మ సాధారణ గృహిణి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం భగత్‌సింగ్ కాలనీలో ఉంటున్న మా నాన్నకు వచ్చే అరకొర ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. ఇక ముగ్గురు పిల్లల చదువులు సాగించడం ఎలా అని నిత్యం మదన పడుతుండేవారు. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మా సమస్య పరిష్కారమైంది. నేను రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్నాను.
చెల్లి సనా కూడా అదే కాలేజీలో డిప్లమో అనంతరం బీటెక్ రెండో సంవత్సరంలో చేరింది. నా తమ్ముడు మహమ్మద్ తాహిర్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్) పథకం ద్వారా నాకు నాలుగేళ్లకు రూ.1.87 లక్షలు మా అమ్మ బ్యాంక్ ఖాతాలో జమ అయింది. నా చెల్లికి కూడా మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద డబ్బు వచ్చింది. నా తమ్ముడికి అమ్మఒడి సొమ్ము ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. ఇప్పుడు మా అమ్మ, నాన్నకు మా చదువుల గురించి బెంగ లేదు. మా భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – సీఎఎస్ అబ్దుల్ రెహమాన్, ప్రొద్దుటూరు (వీరారెడ్డి, విలేకరి, ప్రొద్దుటూరు)
సంక్షేమ పథకాలతో చింతలేని జీవితం
బతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నా. దాని ద్వారా వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు వాహనానికి మరమ్మతులు తప్పనిసరి. ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఇంకా కేసుల సంగతి సరేసరి. ఇలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం తప్పనిసరి అయ్యేది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కె.శివడ గ్రామానికి చెందిన నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది.
ఈ ప్రభుత్వ సాయంతో ఏటా ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు చేయించుకుంటున్నా. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో నా భార్య సురేఖకు వలంటీర్‌గా ఉన్న ఊళ్లోనే ఉపాధి లభించింది. నా భార్యకు, మా అమ్మ సావిత్రికి ‘వైఎస్సార్ ఆసరా పథకం’ ద్వారా ఏటా చెరో రూ.1200 చొప్పున లభించింది. ఇద్దరు పిల్లలూ చదువుకుంటున్నారు. ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందుతోంది. మా అమ్మ సావిత్రికి వితంతు పింఛన్ అందుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో మా జీవనం సాఫీగా సాగుతోంది. – నిమ్మల వెంకటరావు, కె.శివడ (జి.పెంటయ్య, విలేకరి, గుమ్మలక్ష్మీపురం)
Comments
Please login to add a commentAdd a comment