ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఆరోగ్యశ్రీతో క్యాన్సర్‌ను జయించా
మాది పేద కుటుంబం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కలివరపుపేటలో ఉంటున్నాం. రెక్కాడితే గాని పూట గడవని పరిస్థితి. ఇద్దరు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే నా భర్త మృతి చెందారు. కాయ కష్టం చేసి పిల్లలను పెంచాను. అమ్మయికి వివాహం చేశాను. కుమారుడు చేతికందొచ్చి కూలి పనులకు వెళుతున్నాడు. ఇక హాయిగా జీవనం సాగించవచ్చని అనుకుంటున్న పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న మాకు అంత డబ్బు సమకూర్చలేక చతికల పడ్డాం. ప్రాణాల మీద ఆశలు వదులుకున్నా.
ఇంతలో మా వీధి వలంటీరు వచ్చి క్యాన్సర్ చికిత్సను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారని చల్లని కబురు చెప్పారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే విశాఖ నగరంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి రిఫర్‌చేశారు. అక్కడ ఉచితంగా అన్ని తనిఖీలు చేసి కీమోథెరఫీ చేశారు. ఆరు నెలల క్రితం ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రతి నెలా ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నాను. నా కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఆరోగ్యశ్రీ లో వైద్యం అందించింది. నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దీనికి కారణం జగనన్న పుణ్యమే. జీవితాంతం ఆయన మేలు మరిచి పోలేను. ఇల్లు కూడా మంజూరు చేశారు. నాకు వితంతు పింఛన్ కూడా వస్తోంది. హాయిగా జీవిస్తున్నాము. – వైశ్యరాజు శాంత లక్ష్మి, కలివరపుపేట, నరసన్నపేట (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట)
మా బతుకుల్లో ఎంతో మార్పు
నా పేరు గుడివాడ వెంకటరత్నం. మాది విజయనగరం. ఉపాధి నిమిత్తం పది సంవత్సరాల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వలస వచ్చాం. నా భర్త గౌరినాయుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏ లబ్ధీ రాలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇంటి స్థలం వచ్చింది. రిజి్రస్టేషన్ చేసి పట్టా నాకు అందజేశారు. వైఎస్సార్ ఆసరాలో రుణమాఫీ కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి పొందాను. నాకు త్రివేణి, నవీన్ ఇద్దరు సంతానం. కూతురు త్రివేణి ఎంఎంకేఎన్ మున్సిపల్ హైస్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది.
అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. మా అత్త రమణమ్మ వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందింది. మా లాంటి పేదలకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనాలంటే భారమే. పాఠశాలలు తెరవగానే విద్యాకానుక కిట్టులో ఇవన్నీ అందజేస్తున్నారు. దీంతో మాకు భారం తగ్గింది. పాఠశాలల్లో గోరుముద్ద పథకం కింద పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎంతో రుచికరంగా అందిస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో హాయిగా జీవిస్తున్నాం. మళ్లీ సీఎంగా జగనే రావాలని కోరుకుంటున్నాం. – గుడివాడ వెంకటరత్నం, లక్ష్మినగర్, పాలకొల్లు పట్టణం (కె శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్)
మా ఇంట్లో ఇద్దరికి దివ్యాంగ పింఛన్లు
ఒకప్పుడు సాధారణంగా బతికిన ఉమ్మడి కుటుంబం మాది. చాలా కాలం కిందటే విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నాం. కాలక్రమేణా ఉన్న కొద్ది ఆస్తి కరిగిపోయింది. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ప్రస్తుతం భర్త, కుమారునితో కలిసి జీవనం సాగిస్తున్నాం. భర్త పళ్లంరాజు, కుమారుడు సాయిరామ్ పుట్టుకతోనే దివ్యాంగులు. వారు ఏ పనీ చేయలేరు. వారి ఆలనా పాలనా అన్నీ నేనే చూసుకోవాలి.
ఈ పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబానికి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పింఛన్ మంజూరు చేయగా నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దివ్యాంగ పింఛన్‌ను రూ.3 వేలకు పెంచి ఇవ్వడంతో ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నాం. భర్త, కుమారుడికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఇద్దరికీ రూ.6 వేలు వికలాంగ పింఛన్ ప్రతి నెలా వస్తోంది. నేను చిన్నచిన్న పనులు చేసుకుంటుండడంతో ఇంటి భత్యం గడిచిపోతోంది. ఉన్న కొద్దిపాటి ఇంటి స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాం. – బచ్చు మంగతాయారు, కొత్తపేట (జగత శ్రీరామచంద్రమూర్తి,విలేకరి, కొత్తపేట)
Comments
Please login to add a commentAdd a comment