ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
జగనన్న సాయంతో నా కుటుంబం ఖుషీ
జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ సాయంతో ఇప్పుడు నా కుటుంబం హ్యాపీగానే ఉంది. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం సీతాపతిరావు పేటవీధి. నేను ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబం ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలనుంచి లబ్ధి అందుకుంటున్నారు. స్వయం సహాయక సంఘం సభ్యురాలినైన నేను ప్రస్తుతం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రగతి యూనిట్ ద్వారా ఇచ్చిన రుణంతో పేపర్ ప్లేట్ల యూనిట్‌ను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నాను.
జగనన్న ప్రభుత్వం వచ్చాక మా అబ్బాయిని ఓ దారిలో పెట్టుకునే అవకాశం కూడా వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి వార్డు సచివాలయం పరిధిలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతీ నెలా నేను వితంతు పింఛన్ రూ.3 వేలు అందుకుంటున్నాను. ఆసరా పథకం ద్వారా కూడా లబ్ధి పొందాను. గత ప్రభుత్వంలో సాయం పొందాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి వచ్చేది. ఇప్పడు జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో సంతోషంగా ఉంటున్నాం.
– కుడుపూడి సుజాత, సీతాపతిరావుపేట వీధి – (పరసా సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్)
పెద్ద కొడుకులా ఆదుకున్నారు
ముప్పై ఏళ్ల నుంచి రోడ్డు మార్జిన్‌లో పూరిపాకలో నివాసం ఉండేవాళ్లం. బిక్కు బిక్కుమంటూ గడిపాం. సొంతింటి కల సాకారం అవుతుందని అనుకోలేదు. గతంలో ఇంటి కోసం నాయకులు చుట్టూ తిరిగి అలసి పోయాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటికి వచ్చి మా వివరాలు తీసుకుని వెళ్లారు. ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోగలిగాం. మాకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికి పెళ్లిళ్లు చేశాం. జగన్‌మోహన్‌రెడ్డి నా పెద్ద కొడుకులా ఆదరించారు. నేను మాంసం దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడిని.
అనుకోకుండా రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. మూలన పడ్డాను. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న రూ.3 వేలు పింఛనే నా కుటుంబానికి ఆధారమైంది. గత ఏడాది వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ అనంతరం ఇంటికి వచ్చే సమయంలో పోషణ నిమిత్తం రూ.30 వేలు ఇచ్చారు.. నా భార్య మదీనా బీబీకి చేయూత పథకం ద్వారా మూడేళ్ల నుంచి ఏటా రూ.18,500 సాయం అందుతోంది. మాది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు గ్రామం. మాలాంటి వాళ్లం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.
– ఎస్‌కే వల్లీ మస్తాన్, –జీవీవీ సత్యనారాయణ, విలేకరి, కొవ్వూరు
మా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్నారు
నాయీ బ్రాహ్మణ కుటుంబం మాది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బొంతల వీధి. తెలుగు దేశం హయాంలో ఎటువంటి పథకాలూ వర్తించలేదు. ఇంటి కోసం కాళ్లావేళ్లా పడ్డా ప్రయోజనం లేకపోయింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పలు పథకాలు మాకు వర్తిస్తున్నాయి. ఆనందంగా జీవిస్తున్నాం. జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేట వద్ద మూడు లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి రూ.1.85 లక్షలు మంజూరు చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా నుంచి రూ. 50 వేలు వడ్డీలేని రుణం ఇచ్చారు. మా భార్యకు ఆసరా పథకం వర్తించింది.
రూ.60 వేలు మాఫీ చేశారు. పాప 8వ తరగతి చదువుతోంది. అమ్మ ఒడి నాలుగేళ్లుగా వస్తోంది. ఈ ఏడాది ట్యాబు కూడా ఇచ్చారు. నాకు మెయిన్ రోడ్డులో సెలూన్ షాపు ఉంది. దీనికి జగనన్న చేదోడు పథకంలో రూ.10 వేలు చొప్పున నాలుగు సంవత్సరాలు ఇచ్చారు. షాపునకు కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వమే కడుతోంది. ఇంటిల్లిపాదీ అందరికీ పథకాలు అమలు చేయడంతో మాకు ఎంతో మేలు జరిగింది. – దాసరి శ్రీరాములు, బొంతల వీధి – మామిడి రవి, విలేకరి, నరసన్నపేట
Comments
Please login to add a commentAdd a comment