ఫైల్‌ఫోటో
మిస్టరీగా మారిన కేసుల్లో నిందితుల ఆచూకీ కనుగొనడంలో పోలీసు జాగిలాల పాత్ర కీలకంగా ఉంటోంది. మనుషులకు సాధ్యం కాని పనిని జాగిలాలు చేస్తూ నేర పరిశోధనలో పోలీసులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. వైఎస్సార్ జిల్లా పోలీసు యంత్రాంగం వీటికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడమే గాక.. పోషణ బాధ్యతలను పక్కాగా నిర్వర్తిస్తోంది.
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని డాగ్ స్క్వాడ్ వింగ్ (డీఎస్‌డబ్లు్య) లేదా (డిస్ట్రిక్ట్ కెనైన్ స్క్వాడ్) జాగిలాలు నేర సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ద్వారా నిందితులకు సంబంధించిన ఆనవాళ్లను పసిగట్టడంలో విశేష ప్రతిభ చాటుతున్నాయి. తద్వారా సంబంధిత పోలీసు అధికారులు తమ విచారణను వేగవంతం చేసి కేసుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
జాగిలాల ప్రత్యేకతలివే
శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
8 నెలల పాటు కఠోర శిక్షణ
లూసీతో షేక్‌హ్యాండ్ తీసుకుంటున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ (ఫైల్‌ఫోటో)
గుంటూరు జిల్లా మంగళగిరి బెటాలియన్‌లోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్‌లో మూడు లేదా నాలుగు నెలల వయసున్న పప్పిస్‌కు (పిల్లలు) హ్యాండ్లర్స్(శిక్షకులు) నేర పరిశోధనకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. 8 నెలల పాటు కొనసాగే ఈ శిక్షణ ఇచ్చేందుకు జంతు ప్రేమికులుగా ఉన్న ఏఆర్ పోలీసులను ఎంపిక చేస్తారు.ఈ శిక్షణ కాలంలో రెండు నెలల పాటు కాలకృత్యాలు, ఆహారం, ప్రేమగా చూసుకోవడం, పిలిచిన వెంటనే వచ్చేందుకు ప్రేమానురాగాలను నేర్పిస్తారు. తరువాత రెండు నెలల్లో సాధారణ మర్యాదలైన సిట్, స్టాండ్, కమ్, రోల్, సెల్యూట్‌లను నేర్పిస్తారు. ఆ తరువాత మరో నాలుగు నెలల పాటు పేలుడు పదార్థాలను గుర్తించేందుకు గన్‌పౌడర్‌ను వాసన చూపించడంతో పాటు, బాక్స్‌లో గన్‌పౌడర్‌ను వేసి దానిని విసిరేసి తీసుకు వచ్చే విధంగా రోజు సాధన చేయిస్తారు.
12 జాతుల వినియోగం
ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధన అవసరాలకు వినియోగించుకుంటోంది. జిల్లాలో 10 జాగిలాలు డాగ్‌స్క్వాడ్ వింగ్‌లో ఉన్నాయి. వీటిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక్కో డాగ్‌కు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటిలో ఉన్న లాబ్రడార్ జాతికి చెందిన 5 జాగిలాలను పేలుడు పదార్థాలను కనుకొనేందుకు, ట్రాకర్ డాగ్స్‌గా పిలువబడే జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ జాతులకు చెందిన రెండు జాగిలాలను నేరపరిశోధనకు వినియోగిస్తారు. అలాగే మరో 3 జర్మన్‌షెపర్డ్, బెల్జియం మెలనాయిస్, లాబ్రడార్‌లను ఎర్రచందనం దుంగలను కనుగొనేందుకు వినియోగిస్తారు. అలాగే వీఐపీల భద్రత, అజ్ఞాతంగా వచ్చే బెదిరింపు కాల్స్, పేలుడు పదార్థాలను గుర్తించడం, ఇలా వివిధ సందర్భాల్లో జాగిలాల సేవలను పోలీసు శాఖ వినియోగించుకుంటోంది.
ప్రతిభ.. పతకాలు
డ్యూటీమీట్‌లో ప్రతిభ చాటిన డాగ్‌తో హ్యాండ్లర్స్ (ఫైల్‌ఫొటో)
రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే డ్యూటీమీట్స్, శిక్షణలలో జాగిలాలు ప్రతిభ చాటి అనేక పతకాలను సాధిస్తున్నాయి. పోలీసులకు సవాల్‌గా మారిన పలు కేసులను ఛేదించడంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ కీలకంగా వ్యవహరించి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అభినందనలు పొందుతున్నాయి. 2017 చండీఘర్‌లో, 2019లో మైసూరులో నిర్వహించిన ఆల్ ఇండియా డ్యూటీమీట్‌లో ట్రాకర్ డాగ్ డాన్‌న్‌రెండుసార్లు పాల్గొంది. 2014లో నిర్వహించిన శిక్షణ పోటీల్లో ట్రాకర్ డాగ్ డాన్ ట్రాకింగ్‌లో ప్రథమ బహుమతి సాధించి గోల్డ్‌మెడల్ పొందింది. డాగ్ వాగా ఎక్స్‌ప్లోజివ్‌లో ద్వితీయ బహుమతితో సిల్వర్ మెడల్ పొందింది.
ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నాలుగు డాగ్స్ పాల్గొన్నాయి. ఇందులో ట్రాకర్‌లో డాగ్ డాన్, ఎక్స్‌ప్లోజివ్‌లో జాగిలం వాగ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో పోలీసు జాగిలం లూసీ ప్రతిభ చాటింది. లాబ్రడార్ జాతికి చెందిన లూసీ పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్టగా పేరొందింది. రాష్ట్ర స్థాయిలో పేలుడు పదార్థాల గుర్తింపునకు సంబంధించిన పోటీలో లూసీ సత్తా చాటింది.
వైఎస్సార్ జిల్లాలో పోలీస్ డాగ్స్ ఛేదించిన క్లిష్టమైన కేసుల వివరాలిలా..
2017 సంవత్సరం ఆగస్టు 14న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువ జంట మిస్సింగ్ కేసు
గత ఏడాది మార్చి 14న సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య
గత ఏడాది ఆగస్టు 29న పెండ్లిమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య
గత ఏడాది నవంబర్ 18న రామాపురం హత్య కేసు
ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన చెన్నూరులోని దేవాలయంలో జరిగిన చోరీ
ఈ ఏడాది జూన్ 2న కడప నగరం చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ
ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఖాజీపేట
ఆలయంలో జరిగిన చోరీ కేసులను ఛేదించి నిందితులను కనుగొనడంలో విశేష ప్రతిభ చాటాయి.
నేరపరిశోధనలో డాగ్స్ ఉత్తమ ప్రతిభ
జిల్లాలో నేరపరిశోధనలో డాగ్స్ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. పోలీసు డ్యూటీమీట్స్‌లో ప్రతిభ చాటి బహుమతులు పొందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
– కేకేఎన్ అన్బురాజన్,జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment