చైతన్యా.. ఎక్కడున్నావ్.. ఎలా ఉన్నావ్.. క్షణం చూడకపోతేనే ఉండలేకపోయేవాళ్లం.. అలాంటిది అప్పుడే భారంగా 24 గంటలు గడిచిపోయాయి. మావల్ల కావడం లేదు. గుండెలవిసిపోతున్నాయి. మంచినీళ్లూ ముట్టలేకపోతున్నాం. నీ మాటలే మా చెవుల్లో మార్మోగిపోతున్నాయి. వచ్చీరాని ముద్దు ముద్దు మాటలతో మా గుండెనిండా నిండిపోయావ్.. మనసంతా ఏదో తెలియని బాధ. ఏ బూచోళ్లు నిన్ను ఎత్తుకెళ్లారు.. మేమేం పాపం చేశాం. మాకెందుకీ తీరని మానసిక శిక్ష.. భరించలేం కన్నా.. దేవుడా.. మా చిన్నారిని కాపాడు.. ప్రాణాలతో మా చెంతకు చేర్చు.. కావాలంటే మా ప్రాణాలు తీసుకో.. బాబు మళ్లీ తిరిగి వస్తాడని గంపెడాశతో క్షణాలు లెక్కపెట్టుకుంటున్నాం.. పగవారికీ కూడా ఇలాంటి బాధ రాకూడదు.. (బాలుడు చైతన్య తల్లితండ్రుల గుండెల్ని పిండేస్తున్న వేదన ఇది)
రాయవరం: కంటికి రెప్పలా చూసుకునే బిడ్డ ఒక్క క్షణం కనిపించక పోతేనే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది ఒక్క రోజు గడిచినప్పటికీ కన్న బిడ్డ ఆచూకీ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. రాయవరం మండలం వి.సావరం ఇటుకుల బట్టీ వద్ద ఆదివారం వేమగిరి చైతన్యకుమార్ అనే రెండున్నరేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం పాఠకులకు విదితమే. 24 గంటలు గడిచినప్పటికీ తమ బిడ్డ ఆచూకీ లేకపోవడంతో తల్లి దుర్గాభవాని, తండ్రి లోవరాజులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అడ్డతీగల మండలం డొక్కపాలేనికి చెందిన ఈ దంపతులిద్దరూ ఇటుకల బట్టీ కూలీలుగా పని చేస్తున్నారు.
కనురెప్ప వేసేంతలోనే...
అప్పటి వరకు తన వద్దే ఉన్న తన బిడ్డ ఐదు నిమిషాల వ్యవధిలో కని్పంచకుండా పోయాడని తల్లి దుర్గాభవాని కన్నీటి పర్యంతమవుతోంది. అప్పటికే రెండు సార్లు బయటకు వెళ్లకుండా కాచుకున్నానని, నడుము బాధ వస్తుందని విశ్రాంతి తీసుకుంటున్న క్షణంలోనే బయటకు వెళ్లాడని రోదిస్తూ చెప్పింది. ఐదు నిమిషాల వ్యవధిలో చుట్టుపక్కల గాలించినా కనిపించలేదని వాపోతోంది. ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్న చైతన్యను అప్పగించాలని ఆమె రెండు చేతులూ జోడిస్తూ ప్రాధేయపడుతోంది. నిండు గర్భిణిగా ఉన్న దుర్గాభవాని, తండ్రి లోవరాజులు అన్నపానీయాలు ముట్టకుండా కంట్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా కుమారుడు చెంతకు చేరుకుంటాడన్న కొండంత ఆశపడుతున్నా. బట్టీలోని సహచర కూలీలకు వారిని ఓదార్చడం తమ తరం కావడంలేదు.
ఎవరా అగంతకులు
చైతన్యకుమార్‌ను ద్విచక్రవాహనంపై అగంతకుడు తీసుకుని వెళ్లడం చూసినట్లు రాయవరం గ్రామ పరిధిలోని ఇటుకల బట్టీలో పనిచేసే మణిమాలనీదేవి పోలీసులకు తెలిపింది. తొలుత పోలీసులు బాలుడు అదృశ్యమైనట్లుగా కేసు నమోదు చేయాలని భావించినా.. చైతన్యకుమార్‌ను అగంతకుడు తీసుకుని వెళ్లినట్లుగా భావించడంతో కిడ్నాప్‌గా దిశగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అగంతకుడు మోటార్ సైకిల్‌పై తీసుకుని వెళ్లే సమయంలో బాలుడు ఏడ్వకుండా వెళ్లడం చూస్తే తెలిసిన వారి పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదన్న విషయం బాలుడి తల్లిదండ్రుల ఆరి్ధక పరిస్థితిని బట్టి అర్ధమవుతుంది. పిల్లలు లేని వారెవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు వేగవంతం
పోలీసులు ఆదివారం రాత్రి నుంచి బాలుడు చైతన్యకుమార్ ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన పరిసర ప్రాంతానికి నలువైపులా వివిధ గ్రామాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులకు ఎవరితోనైనా తగాదాలున్నాయా? బాలుడిని కిడ్నాప్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? పిల్లలు కావాలనుకునే వారు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? తదితర భిన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అనపర్తి సీఐ ఎన్‌వీ భాస్కరరావుల పర్యవేక్షణలో ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ ఫుటేజీల ఆధారంగానే పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు.
రెండున్నరేళ్ల బాలుడు కిడ్నాప్ కేసు
Published Tue, Jan 26 2021 8:52 AM | Last Updated on Tue, Jan 26 2021 10:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment