బాపట్ల: సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకతతో నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఫొటోలు డబల్ ఎంట్రీలు, మృతుల ఓట్లు తొలగింపులో నిర్లిప్తంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించలేదని వస్తున్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 మంది బీఎల్‌ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులపై 2,08,740 దరఖాస్తులు అందినట్లు వివరించారు. వాటిలో 32,056 దరఖాస్తులను తిరస్కరించగా, 906 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలినవన్నీ పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో ప్రతిరోజు 500 దరఖాస్తులు
ప్రతిరోజు ఆన్‌లైన్ ద్వారా సుమారుగా 500 దరఖాస్తులు నమోదు అవుతున్నాయని చెప్పారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అన్ని సూచనలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు ముందు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సవరణ చేసిన తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
అన్ని రాజకీయ పార్టీలకు వాటిని అందిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల చిరునామాల మార్పు అంశాన్ని నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ అనుమతుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకే పోలింగ్ కేంద్రంలో 1,500ల మందికి మించి ఓటర్లు ఉంటే అలాంటి ప్రాంతాల్లో ఓటర్ల సౌలభ్యం కొరకు రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, కలెక్టరేట్ ఏఓ కృష్ణకాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ నాయకులు మాల్యాద్రి, షేక్ మహమ్మద్ గౌస్ బాషా, రామకృష్ణ, డి.రవి, జి.నాగరాజు, ఏ బాలాజీరెడ్డి, ఎన్.కోటేశ్వరరావు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment