
మూగ వేదన
కూటమి పాలనలో పశువులకు అందని సంచార వైద్య సేవలు
● మొదటి విడత వాహనాలు నిలిపివేత ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పోషకులు ● వైద్యం చేయించాలంటే వ్యయప్రయాసలు
వాహనాలను పునరుద్ధరించాలి
గత ప్రభుత్వ హయాంలో సంచార పశు వైద్య వాహనాలు ఉండేవి. వాటి ద్వారా పశువులకు ఇంటి వద్దే వైద్యం అందేది. ప్రస్తుతం ఆ వాహనాలు నిలిచిపోవడంతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇటీవల అనారోగ్యంతో రెండు గొర్రెలు చనిపోయాయి. పశువులకు అనారోగ్యం వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూగజీవాల ఆరోగ్యం దెబ్బతింటే ప్రైవేటు వాహనాల ద్వారా సమీపంలోని పశు వైద్యశాలకు తరలించాల్సి వస్తోంది. దీంతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. ప్రభుత్వం తక్షణమే సంచార పశువైద్య వాహనాలను పునరుద్ధరించాలి.
– వల్లు చిన్నగంగయ్య, ముత్తాయపాలెం
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
జిల్లాలో పశుసంవర్ధక శాఖలో మొదటి విడతలో వచ్చిన ఆరు సంచార పశు వైద్య వాహనాల గడువు ముగియడంతో పక్కన పెట్టారు. ప్రస్తుతం రెండో విడతలో వచ్చిన వాహనాలతో పశు పోషకులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మొదటి విడతలో వచ్చిన వాహనాలు మరో 15 రోజుల్లో పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాం.
– డాక్టర్ వేణుగోపాల్,
జిల్లా పశువైద్యాధికారి
బాపట్ల టౌన్: రాష్ట్రంలో 108, 104 తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు వైద్యసేవలు అందేలా ప్రణాళిక అమలు చేసింది. 2022 మే 18వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది. ఉన్నత లక్ష్యంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ చర్యలు చేపట్టారు. నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు. నిరంతరాయంగా పశువులకు సేవలు అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వీటికి గ్రహణం పట్టింది. నెల రోజులుగా వాహనాలు మూలకు చేరాయి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు వాటిని నిలిపివేశారు.
ఆందోళనలో పశుపోషకులు
జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. సమస్య వస్తే జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. 20 రకాల మల సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా వాహనంలో ఉంచారు. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని తీర్చిదిద్దారు. దీనికి 108, 104 తరహాలోనే 1962 నంబరును కేటాయించారు. జిల్లాలో రెండు విడతలలో 6 చొప్పున వాహనాలు మంజూరు చేశారు. ప్రస్తుతం నెల రోజులుగా 6 వాహనాలతోనే వైద్యం అందిస్తున్నారు. పశువులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు.
నియోజకవర్గం ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పందులు కోళ్లు
అద్దంకి 3,658 87,341 1,78,129 19,299 1,251 63,666
బాపట్ల 4,195 68,554 50,931 10,952 126 1,54,663
చీరాల 1,640 26,844 33,467 2,723 151 44,125
పర్చూరు 3,676 50,287 1,05,939 8,557 528 64,226
రేపల్లె 6,226 90,187 44,175 3,997 468 2,69,760
వేమూరు 2,535 58,551 14,882 4,462 695 1,79,582
మొత్తం 21,930 3,81,764 4,27,523 49,990 3,219 7,76,022
జిల్లాలోని పశువుల సమాచారం

మూగ వేదన

మూగ వేదన