
వైద్య కళాశాల ల్యాబ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
గుంటూరు మెడికల్: పల్నాడు జిల్లాలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతి చెందడంతో నిర్ధారణ చేసేందుకు రెండు రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేంద్రం బృందం పర్యటిస్తోంది. పల్నాడు జిల్లాలో ఒక రోజు, మంగళగిరి ఎయిమ్స్‌లో మరోరోజు పరిశీలన అనంతరం మూడోరోజు శనివారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చింది. కళాశాలలోని వైరాలజీ ల్యాబ్ (వీఆర్‌డీఎల్)ను సభ్యులు పరిశీలించారు. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు తొమ్మిది మందికి గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్‌లో శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ల్యాబ్‌లో ఉన్న వసతులు, వారికి చేసిన వైద్య పరీక్షల గురించి మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వాణిశ్రీని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ నిర్వహణ, పనితీరు, వైద్య పరికరాలు, సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఐడీఎస్‌సీ ఏపీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ భార్గవి రాజ్, ఎన్‌సీడీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకూర్ గార్గ్, ఎన్‌సీడీసీ మైక్రోబయాలజిస్ట్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నిధి షైని, ఎయిమ్స్ మంగళగిరి పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర, ముంబాయి ఐసీఎస్‌ఆర్ సైంటిస్ట్ డాక్టర్ శైలేష్ పవర్ ఉన్నారు.