
తలసేమియా ట్రాన్స్‌ప్యూజన్ సెంటర్‌కు స్థలం కేటాయించండి
కలెక్టర్‌ను కోరిన రెడ్‌క్రాస్ కార్యవర్గ సభ్యులు
నరసరావుపేట: రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ‘మీ డాక్టర్ మీ ఇంటికి’ అనే ప్రాజెక్టు దేశం మొత్తంలో 33 జిల్లాలకు మంజూరు కాగా అందులో పల్నాడు జిల్లా ఒకటని రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ పి.అరుణ్‌బాబును కలిసి రెడ్‌క్రాస్ జిల్లా కార్యకలాపాలను గురించి వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించి జిల్లాలో ఉన్న గిరిజన తండాలు, మత్స్యకారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యాన్ని అందజేస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాకు రెడ్ క్రాస్ ద్వారా తలసేమియా ట్రాన్స్‌ఫ్యూజన్ సెంటర్ మంజూరైందని, సుమారు రూ.6లక్షల విలువ చేసే సామగ్రి కూడా మంజూరు చేశారని, ఈ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో 10 పడకల స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఆర్డీఓ కాంపౌండ్‌లో ఉన్న 15 సెంట్ల రెడ్‌క్రాస్ స్థలాన్ని సర్వే చేయించి రెడ్‌క్రాస్‌కు కేటాయిస్తే అందులో నూతన భవన నిర్మాణం చేసి ఓల్డ్ ఏజ్ హోమ్, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్, ఉచిత వైద్యశాల, అనాథ శరణాలయం, జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు డాక్టర్ కంజుల తెలిపారు. రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.