భద్రాద్రి: ఇల్లెందులోని సింగరేణి కార్మికవాడల్లో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు సంచరించిన సంఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ మొదటి లైన్‌లో శనివారం తెల్లారుజామున 3.35 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆగంతకుడు ముఖానికి మంకీ క్యాప్, మాస్క్ ధరించి కొన్ని ఇళ్లల్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఇల్లెందులోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేస్తున్న క్రాంతి, సింగరేణి స్కూల్‌లో పని చేస్తున్న ఆయన సతీమణి కృష్ణవేణి నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్‌లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. వారి క్వార్టర్ ముందు కిటికీ తీసి ఇంట్లోకి మొబైల్ టార్చ్ వేసి చూశాడు. ఇంట్లోని కుక్క గమనించి అరవడంతో ఇంటి యజమాని కృష్ణవేణి నిద్ర లేచింది. కిటికీ ముందు నిలబడిన ఆగంతకుడు మొబైల్ టార్చ్ వేసుకుని చూస్తుండటంతో భయపడిన కృష్ణవేణి కేకలు వేసింది.
ఆ సమయంలో భర్త క్రాంతి ఊరెళ్లాడు. పక్కింటివారికి ఫోన్ చేయగా, వారు నిద్రలేచి వెతికినా అప్పటికే ఆగంతకుడు పారిపోయాడు. అదే లైన్‌లో మరికొన్ని ఇళ్లల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. గతేడాది వేసవిలో కూడా ఇదే తరహాలో పట్టణంలో దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. తాజాగా సింగరేణి కాలనీలో ఆగంతకుడి సంచారంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment