
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
చుంచుపల్లి: జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన 70 ట్రై మోటర్ సైకిళ్లను ఆదివారం దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీ అభివృద్ధి సంస్థ వినూత్న కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి, గ్రామాల్లో మౌలిక వసతులు, దివ్యాంగులకు చేయూత నందించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమని అన్నారు. దివ్యాంగులు మోటార్ సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అడవులు అంతరించి పోకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత దివ్యాంగులపై ఉందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం వివిధ సంస్థలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలో పోడు కొట్టడం ద్వారా కొంత అటవీ విస్తీర్ణం తగ్గిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అడవులు, చెట్ల నరకివేతతో మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ స్కైలాబ్, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజన్ మేనేజర్లు చంద్రమోహన్, కవిత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య