
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.
దరఖాస్తుదారుల పడిగాపులు
చుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ కష్టాలు తప్పడం లేదు. రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ తరుచూ మొరాయిస్తోంది. మరోవైపు గడువు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. గంటల కొద్దీ మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా తాజాగా ఆఫ్‌లైన్‌లోనూ అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక నమూనా దరఖాస్తులను జిల్లాకు పంపగా, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. కానీ ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఆన్‌లైన్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి.