
వినూత్న ఆదాయ మార్గాలతో గాడిలోకి
చిన్న పట్టణాల కస్టమర్ల కోసం కంటెంట్
న్యూఢిల్లీ: దేశీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లు కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ పుంజుకుంటున్నాయి. వినూత్న ఆదాయ మార్గాల వ్యూహాలు, హైపర్–లోకల్ కంటెంట్ ఇందుకు దోహదం చేస్తోంది. 2020లో టిక్‌టాక్ నిషేధం తర్వాత పుట్టుకొచ్చిన మోజ్, జోష్, చింగారీ, ఎంఎక్స్ టకాటక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు తిరిగి వృద్ధి సంకేతాలను చూపుతున్నాయి.
ఈ రంగం 200 మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని అధిగమించింది. విస్తరణకు భారీ అవకాశాలు ఉన్నాయని రెడ్‌సీర్ నివేదిక వెల్లడించింది. ప్రకటనల ఆదాయాలను పెంచుకోవడానికి, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్ట్రాగామ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడటానికి సవాళ్లను ఎదుర్కొన్నందున ఈ ప్లాట్‌ఫామ్‌లు మందగించాయి. అయితే తృతీయ, నాల్గవ తరగతి నగరాలు, భారతీయులను చేరుకునే లక్ష్య వ్యూహాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త ఆదాయ మార్గాలు..
ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పట్టణ, ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, దేశాల నుండి చలనచిత్రాలు, మీడియాను వినియోగించే విభిన్న ప్రేక్షకుల సమూహాలకు సేవలను అందిస్తున్నాయి. దీంతో దేశీయ ప్లాట్‌ఫామ్‌లకు చిన్న నగరాల్లో అవకాశాలు భారీగా ఉంటున్నాయి. దేశీయ ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రత్యేక ఆదాయ మార్గాల మోడళ్లను అనుసరిస్తున్నాయని అర్థ వెంచర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్‌నర్ అనిరుధ్ ఏ దమాని తెలిపారు. ఈ వేదికల పునరుద్ధరణకు కొత్త ఆదాయ మార్గాలు ప్రధానమైనవి. బ్రాండ్ భాగస్వామ్యాలు, పాయింట్స్, రివార్డ్స్, ఈ–కామర్స్ అనుసంధానం వంటి భారత్ ఆధారిత విధానాలు దేశీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌ను పునర్నిర్మిస్తున్నాయి.
3.3 బిలియన్ డాలర్లకు..
దేశీయ కంటెంట్, హైపర్–లోకల్ అనుసంధానంపై దృష్టి సారించడం దేశీయ వీడియో ప్లాట్‌ఫామ్‌ల వృద్ధిలో కీలకమైనంది. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్ల వినియోగదారులు ప్రాధాన్యతగా జోష్ కంటెంట్ 80 శాతం కంటే ఎక్కువ ప్రాంతీయ భాషల్లో ఉంది. సాంస్కృతిక, స్థానికులకు అవసరమైన కంటెంట్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తున్నాయి. ఈ విషయంలో సంప్రదాయ ప్లాట్‌ఫామ్‌లు చాలా కష్టపడుతున్నాయని దమానీ అన్నారు.
అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం అంతర్జాతీయంగా షార్ట్ వీడియో మార్కెట్ 2023లో 1.6 బిలియన్ డాలర్ల నుండి 2032 నాటికి 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో 3.3 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. 2023–24లో 90–100 మిలియన్ డాలర్ల ప్రకటనల ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ.. దేశీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల వాటా భారత మొత్తం డిజిటల్ ప్రకటన వ్యయంలో కేవలం 1–1.5 శాతమే.
లాభదాయక ప్రత్యామ్నాయం..
వర్చువల్ టిప్పింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లాభదాయక ప్రత్యామ్నాయాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వర్చువల్ టిప్పింగ్ మార్కెట్ మాత్రమే 70–220 మిలియన్ డాలర్ల నుండి 2030 నాటికి 700–800 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని రెడ్‌సీర్ అంచనా వేసింది. ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యక్తిగతీకరణ, డేటా అనలిటిక్స్, వ్యక్తిగతీకరించిన కంటెంట్ రూపకల్పనలో పెట్టుబడులు వినియోగదార్లతో అనుసంధానాన్ని మెరుగుపరిచాయి.
వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాల్లోని ప్రవాసులపై దేశీయ వీడియో ప్లాట్‌ఫామ్‌లు దృష్టి సారిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు కేవలం క్రియేటర్లు, మార్కెటర్ల అవసరాలను తీర్చడానికి మాత్రమే అభివృద్ధి చెందడం లేదు.. కానీ స్థిర, దీర్ఘకాలిక వృద్ధికి తమను తాము నిలబెట్టుకుంటాయని ఐపీవీ సహ వ్యవస్థాపకుడు, ఫిసిస్ క్యాపిటల్ భాగస్వామి మితేష్ షా తెలిపారు.
నేరుగా ఆదాయం..
ప్రకటనలతో సంబంధం లేకుండా కంటెంట్ క్రియేటర్స్ నేరుగా ఆదాయం ఆర్జించేందుకు చింగారికి చెందిన గారి నెట్‌వర్క్ క్రిప్టోకరెన్సీ, సోషల్ టోకెన్లను ఉపయోగిస్తోంది. రొపోసో ఒక అడుగు ముందుకేసి కంటెంట్‌లో ఈ–కామర్స్‌ను జోడించింది. తద్వారా వినియోగదారులు నేరుగా యాప్‌లో షాపింగ్ చేయడానికి వీలు కల్పిస్తోంది. 18 కోట్లకుపైగా క్రియాశీల వినియోగదారులతో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌తో జోష్ భాగస్వామ్యాన్ని పెంచుకుంది. కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ప్రాంతీయ భాషలపై దృష్టి సారించింది. మొహల్లా టెక్ ప్రమోట్ చేస్తున్న మోజ్ యాప్ 2022–23లో 33 శాతం వృద్ధితో రూ.540 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment